శుక్రవారం 10 జూలై 2020
Business - Mar 24, 2020 , 22:58:08

ఎల్‌ఐసీ పై కరోనా పిడుగు

ఎల్‌ఐసీ పై కరోనా పిడుగు

-రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు కోల్పోయిన సంస్థ

న్యూఢిల్లీ, మార్చి 24: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ పెట్టుబడులు అమాంతం కరిగిపోయాయి. కరోనా వైరస్‌ దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో అతి పెద్ద సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ ఏకంగా రూ.2 లక్షల కోట్ల వరకు కోల్పోయింది. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు 30 శాతం వరకు పతనమవడంతో అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. డిసెంబర్‌ చివరి నాటికి రూ.6.02 లక్షల కోట్లుగా ఉన్న ఎల్‌ఐసీ పెట్టుబడులు గడిచిన రెండున్నర నెలల్లో ఏకంగా రూ.1.9 లక్షల కోట్లు తగ్గి రూ.4.14 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు ఐపీవోకి రావడానికి సిద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతుండటం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌లో ఉన్న 209 కంపెనీల్లో ఎల్‌ఐసీ ఒక్క శాతానికి పైగా పెట్టుబడులు పెట్టింది. బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల క్యాపిటలైజేన్‌ మొత్తం విలువలో వీటి వాటా 65 శాతానికి పైగా ఉన్నది.  ఆవిరైన పెట్టుబడుల్లో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల వాటా అత్యధికంగా 30 శాతం ఉండగా,  ఆ తర్వాతి చమురు అండ్‌ గ్యాస్‌, సిగరెట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెటల్స్‌, ఆటోమొబైల్స్‌, మౌలిక రంగాలు ఉన్నాయి. ఈ కరోనా వైరస్‌ దెబ్బకు సేవల రంగం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుండగా, కానీ, వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం కొసమెరుపు.  


logo