LIC Credit Cards| ఇప్పటి వరకు బీమా సేవలందించిన జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఇక నేరుగా ఫైనాన్సియల్ సర్వీసెస్ రంగంలోకి అడుగిడింది. ఐడీబీఐ బ్యాంక్‌తో కలిసి రెండు రూపే క్రెడిట్ కార్డులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఎల్ఐసీ కార్డ్స్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎల్ఐసీ సీఎస్ఎల్) ఈ కార్డులను శనివారం ఆవిష్కరించింది. లుమిన్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ ( ‘Lumine’ Platinum Credit Card ), ఎక్లాట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ ( ‘Eclat’ Select Credit Card ) పేరిట కస్టమర్లకు లభ్యం కానున్నాయి.
సభ్యుల జీవన శైలికి అనుగుణంగా క్రెడిట్ లిమిట్ అందిస్తామని ఎల్ఐసీ సీఎస్ఎల్, ఐడీబీఐ బ్యాంక్ పేర్కొన్నాయి. కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా విభిన్నమైన ఆఫర్లు, బెనిఫిట్లను అందిస్తున్నాయి ఈ క్రెడిట్ కార్డులు. ఈ కార్డులతో రూ.100 వినియోగానికి ఒక బెనిఫిట్ ఆఫర్ చేస్తున్నాయి. లుమినె కార్డు దారులకు మూడు డిలైట్ పాయింట్లు, ఎక్లాట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డు దారులకు నాలుగు పాయింట్లు లభిస్తాయి.
ఈ క్రెడిట్ కార్డులతో పాలసీ దారుల బీమా ప్రీమియం చెల్లింపులు, రెన్యూవల్ మొత్తం చెల్లింపులపై రెండు రెట్ల రివార్డు పాయింట్లు లభిస్తాయి. లుమినే కార్డుదారుడు పొందిన 60 రోజుల టైం ఫ్రేమ్‌లో రూ.10 వేలు ఖర్చు చేస్తే 1000 వెల్కం బోనస్ డిలైట్ పాయింట్లు పొందొచ్చు.. అదే ఎక్లాట్ కార్డు దారులు 1500 పాయింట్లు సంపాదించొచ్చు.
రూ.400 పై చిలుకు ఇంధన వినియోగ లావాదేవీలపై ఒకశాతం ఫ్యూయల్ సర్‌చార్జీ మాఫీ అవుతుంది. రూ.3000 పై చిలుకు లావాదేవీలను ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటే ప్రాసెసింగ్ లేదా క్లోజర్ ఫీజు ఉండదు. కార్డు దారుల అవసరాలు, ప్రాధాన్యాలకు అనుగుణంగా మూడు నెలల నుంచి 12 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఎక్లాట్ కార్డుపై జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కాంప్లిమెంటరీ లాంజ్ సౌకర్యం పొందవచ్చు. రెండు కార్డులపై 48 రోజుల వరకు వడ్డీలేకుండా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఈ కార్డులు నాలుగేండ్ల పాటు పని చేస్తాయి.
ఈ కార్డులతో పలు బీమా ఫెసిలిటీస్ కూడా లభిస్తాయి. విమాన ప్రయాణ బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా, శాశ్వత వైకల్యం, క్రెడిట్ షీల్డ్ కవర్, జీరో కార్డ్ లియబిలిటీ తదితర వసతులు ఉన్నాయి. ఈ క్రెడిట్ కార్డులు చాలా కొద్ది నిర్ధిష్ట వర్గాల ఖాతాదారుల కోసమే విడుదల చేస్తున్నట్లు ఎల్ఐసీ తెలిపింది. ఎల్ఐసీ పాలసీ దారులు, ఎల్ఐసీ ఏజెంట్లు, ఎల్ఐసీ ఉద్యోగులు, దాని అనుబంధ సంస్థల ఉద్యోగులకు మాత్రమే ఈ కార్డుల సేవలు పరిమితం.
ఐడీబీఐ బ్యాంక్ ఎండీ కం సీఈవో రాకేశ్ శర్మ మాట్లాడుతూ.. ఎల్ఐసీ సీఎస్ఎల్, రూపేలతో భాగస్వాములం అయినందుకు సంతోషిస్తున్నాం అని చెప్పారు. తమ కస్టమర్లకు ఆరోగ్యం, వినోదం, ప్రయాణంతోపాటు వివిధ రంగాల రివార్డు పాయింట్లతో కూడిన ఇన్నోవేటివ్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
ఎల్ఐసీ సీఎస్ఎల్ సీఈ రాకేశ్ కుమార్ మాట్లాడుతూ ఎల్ఐసీ సీఎస్ఎల్ క్రెడిట్ కార్డుల ఆవిష్కరణలో ఐడీబీఐ, రూపే కార్డులతో భాగస్వాములమైనందుకు సంతోషిస్తున్నామని అన్నారు. కొనుగోలుదారు, విక్రేతలకు ఆర్థిక లావాదేవీలపై సమయం ఆదాతోపాటు వివిధ రకాల బెనిఫిట్లు అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు.డిజిటల్ లావాదేవీలను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
రూపే నెట్‌వర్క్‌పై ఎల్ఐసీ సీఎస్ఎల్, ఐడీబీఐ బ్యాంకు సహకారంతో లుమినె, ఎక్లాక్ క్రెడిట్ కార్డులను ఆవిష్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నామని ఎన్పీసీఐ సీఈవో కం ఎండీ దిలిప్ అస్బే చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
ICICI Bank alert | ఆగస్టు నుంచి ఖాతాదారుల లావాదేవీలపై చార్జీల మోత..!