శనివారం 30 మే 2020
Business - May 05, 2020 , 01:51:00

గట్టెక్కేనా?

గట్టెక్కేనా?

దేశ ఆర్థిక వ్యవస్థపై అందరిలో బెంగ

కరోనా వైరస్‌ ఎలా అదుపులోకి వస్తుంది?.. ఈ లాక్‌డౌన్‌ను ఎప్పుడు ఎత్తేస్తారు?.. ఇప్పుడు అందరి మదిలో ఇవే ప్రశ్నలు  మెదులుతున్నాయి. ప్రభుత్వాలు త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అసలు ఆ సాధారణ పరిస్థితి అంటే ఎలా ఉంటుంది?.. అన్న సందేహాలు అంతటా తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అనుభవిస్తున్న భయానక వాతావరణమే ఇందుకు కారణం. ముఖ్యంగా రేపటి రోజున దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది?.. ఏవిధంగా కోలుకుంటుంది?.. అన్నదే కీలకం.

న్యూఢిల్లీ, మే 4: రెక్కలొచ్చిన పక్షిని నేలకూల్చిన గాలివానలా.. భారత్‌పై కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తిలా మారగలదనుకున్న దేశ ఆర్థిక వ్యవస్థ.. ఇప్పుడు రెక్కలు విరిగిన పక్షినే తలపిస్తున్నది. ఆశలు, ఆశయాలు అన్నీ ఆవిరైపోయి మనుగడ కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మునుపెన్నడూ లేని ఈ విపత్కర పరిస్థితుల మధ్య అసలు భవిష్యత్తు అనేది ఉందా?.. ఉంటే అది ఎలా ఉండబోతున్నది?..

సాధారణ పరిస్థితులు

ఈ అంచనాలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ప్రభుత్వాలు ఈ నెలాఖర్లోగా తొలగిస్తాయి. జూన్‌-జూలై నాటికి పరిస్థితులు చక్కబడుతాయి. అయితే కరోనా రాకముందున్న పరిస్థితులతో వీటిని పోల్చలేం. ఇప్పుడున్న ఆంక్షలు లేకపోయినా.. ప్రయాణాలపై కొనసాగుతాయి. చాలామంది ఇండ్లలోనే ఉంటూ పనిచేస్తారు. రెస్టారెంట్లు, సినిమా హాళ్లు తెరుస్తారు. కానీ నిర్ణీత దూరంలో కస్టమర్లను, ప్రేక్షకులను కూర్చోబెట్టి నడిపిస్తారు.

మళ్లీ వైరస్‌ భయాలు

వైరస్‌ తగ్గడం అన్నది తాత్కాలికం. శీతాకాలంలో మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. అయితే ఇప్పటికంటే అప్పుడు కరోనాను ప్రపంచం సమర్థవంతంగా ఎదుర్కోగలదు. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు మరింతగా అందుబాటులోకి వస్తాయి. కానీ కోలుకుందనుకున్న వృద్ధిరేటు తిరిగి పడిపోతుంది. 

మునుపటి పరిస్థితులు:

చైనా తరహాలోనే ప్రపంచమంతా కరోనా నుంచి విముక్తి పొందుతుంది. మునుపటిలాగే ప్రజలంతా స్వేచ్ఛగా జీవిస్తారు. వ్యాపారాలు, పారిశ్రామిక కార్యకలాపాలు జోరుగా సాగుతాయి. వృద్ధిరేటు తిరిగి రెండంకెల దిశగా పరుగులు పెడుతుంది. ఒకవేళ వైరస్‌ మళ్లీ పుట్టుకొచ్చినా.. దాన్ని సాధారణ జ్వరంగానే చూస్తాం. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుంది. అందరిలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

దుర్భర పరిస్థితులు

ఈ ఏడాదంతా లాక్‌డౌన్‌ ఇలాగే కొనసాగితే దుర్భరమే. వృద్ధిరేటుకు దీర్ఘకాలం చోటే ఉండదు. ప్రపంచ జీడీపీ అతలాకుతలమవుతుంది. వ్యాపారాలు పూర్తిస్థాయిలో జరుగవు. పరిమిత స్థాయి సిబ్బంది, కార్మికులతోనే కార్యాలయాలు, పరిశ్రమలు నడుస్తాయి. ఉత్పత్తి దిగజారి మార్కెట్‌లో ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ప్రయాణాలు నిలిచి రవాణా వ్యవస్థ కుదేలవుతుంది. కరోనా రాక ముందున్న పరిస్థితులు 2023 తర్వాతే చూస్తాం.logo