మంగళవారం 04 ఆగస్టు 2020
Business - Jul 05, 2020 , 01:52:24

18 వేల మందికి ‘కాగ్నిజెంట్‌' ఉద్వాసన!

18 వేల మందికి ‘కాగ్నిజెంట్‌' ఉద్వాసన!

బెంగళూరు: ఐటీ సేవల సంస్థ ‘కాగ్నిజెంట్‌' దేశవ్యాప్తంగా వివిధ యూనిట్లలో దాదాపు 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నదని తెలుస్తున్నది. ప్రస్తుతం సంస్థలో ప్రాజెక్టులు ఇవ్వకుండా సుమారు 18 వేల మంది ఉద్యోగులను ‘బెంచ్‌' పరిమితం చేసిందని, వారిని ఇంటికి సాగనంపేందుకు యాజమాన్యం సంసిద్ధమైందని సమాచారం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె, కొచ్చి, కోల్‌కతా యూనిట్లలో పని చేస్తున్న వారిపై వేటు పడనున్నది. దీనిపై కాగ్నిజెంట్‌ అధికార ప్రతినిధి స్పందిస్తూ తమ సంస్థ కొంత మంది ఉద్యోగాలను తొలగించనున్నదని థర్డ్‌ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో ఖచ్చితత్వం లేదని, కాగ్నిజెంట్‌ ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు. ఉద్యోగుల పనితీరుపై సంస్థ ఇచ్చిన రేటింగ్‌ ప్రకారం 45 రోజుల్లో పనితీరు మెరుగు పర్చుకోవడంలో విఫలమైన వారికి సంస్థ ఈ-మెయిల్స్‌లో తెలియజేస్తున్నదని, ఇటువంటి వారిని రాజీనామా చేయాలని కోరుతున్నదని పలువురు బాధితులు వాపోయారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగుల అనుభవాన్ని బట్టి 12-21 వారాల ప్యాకేజీతోపాటు ఏడాదికి వారం వేతనం చొప్పున ప్యాకేజీనిచ్చి సాగనంపుతున్నదని తెలిపారు. గతేడాది 35-60 రోజులపాటు బెంచ్‌కు పరిమితమైన ఉద్యోగులను వైదొలగాలని కాగ్నిజెంట్‌ కోరింది.


logo