బుధవారం 23 సెప్టెంబర్ 2020
Business - Aug 13, 2020 , 00:02:00

ఉద్యోగ వృద్ధి అంతంతే

ఉద్యోగ వృద్ధి అంతంతే

ముంబై, ఆగస్టు 12: కరోనా సంక్షోభంతో కుదేలైన దేశీయ జాబ్‌ మార్కెట్‌ మళ్లీ క్రమంగా మెరుగుపడుతున్నది. జూన్‌ నెలతో పోలిస్తే జూలైలో ఉద్యోగ నియామక కార్యకలాపాలు స్వల్పంగా పెరిగినట్టు నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ ప్రకటించింది. జూన్‌లో 1,208గా ఉన్న ఈ కార్యకలాపాలు జూలైలో 5 శాతం వృద్ధిచెంది 1,263కు చేరినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడం, కీలక పరిశ్రమలు తిరిగి తెరుచుకోవడం ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ఉద్యోగ నియామకాలు 47 శాతం తక్కువగా జరిగినట్టు స్పష్టం చేసింది. నౌకరీడాట్‌కామ్‌ వెబ్‌సైట్‌లోని జాబ్‌ లిస్టింగుల ఆధారంగా ఉద్యోగ నియామకాలను లెక్కించి నౌకరీ జాబ్‌స్పీక్‌ నెలవారీ సూచీని విడుదల చేసింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఈసారి జూలైలో ఉద్యోగ నియామకాలు హోటల్‌, రెస్టారెంట్లు, విమానయాన, పర్యాటక పరిశ్రమల్లో 80 శాతం, రిటైల్‌ రంగంలో 71 శాతం, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 60 శాతం, ఆయిల్‌, గ్యాస్‌, విద్యుత్‌ రంగంలో 58 శాతం, ఐటీ ఆధారిత సేవల రంగంలో 42 శాతం, ఎఫ్‌ఎంసీజీ రంగంలో 39 శాతం, ఔషధ రంగంలో 38 శాతం, ఐటీ హార్డ్‌వేర్‌ రంగంలో 30 శాతం, వైద్యారోగ్య రంగంలో 20 శాతం తగ్గినట్టు ఈ సూచీ వెల్లడించింది. మెట్రో నగరాల్లో కొవిడ్‌-19 కేసులు పెరగడం, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ లాక్‌డౌన్లను కొనసాగిస్తుండటంతో పెద్ద నగరాల్లో ఉద్యోగ నియామకాలు 50 శాతానికిపైగా తగ్గాయని, జాతీయ స్థాయిలో ఈ తగ్గుదల 47 శాతంగా ఉన్నదని స్పష్టం చేసింది.

ఉద్యోగ నియామకాల తగ్గుదల చెన్నైలో 55 శాతం, ముంబైలో 54 శాతం, బెంగళూరులో 54 శాతం, కొచ్చిలో 33 శాతం, చండీగఢ్‌లో 28 శాతం, జైపూర్‌లో 25 శాతంగా ఉన్నట్టు వివరించింది. కొన్ని కీలక రంగాల్లో పెరిగిన నియామకాలుజూన్‌తో పోలిస్తే జూలైలో కొన్ని కీలక రంగాల్లో ఉద్యోగ నియామకాలు 37 శాతం మేరకు పెరిగినట్టు నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ స్పష్టం చేసింది. ఈ పెరుగుదల మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో 36 శాతం, కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ రంగంలో 27 శాతం, బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ రంగంలో 16 శాతం, ఆటోమొబైల్‌ రంగం లో 14 శాతం, టెలికం రంగంలో 13 శాతం, ఐటీ హార్డ్‌వేర్‌ రంగంలో 9 శాతంగా ఉన్నదని వెల్లడించింది. అయితే జూన్‌తో పోలిస్తే జూలైలో ఉద్యోగ నియామకాలు విద్యా రంగంలో 22 శాతం, ఆతిథ్య రంగంలో 5 శాతం, రిటైల్‌ రంగంలో 2 శాతం తగ్గినట్టు నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ పే ర్కొన్నది.


logo