సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Feb 05, 2020 , 23:17:43

తీరొక్క కారు!

తీరొక్క కారు!

రెండేండ్లకొకసారి జరిగే వాహన పండుగ కొత్త కార్లతో కళకళలాడింది. దేశీయ, అంతర్జాతీయ వాహన తయారీ సంస్థలు తమ నూతన కార్లను గ్రేటర్‌ నోయిడాలోని ఆటో మొబైల్‌ ఎక్స్‌పో వేదికగా ప్రదర్శించాయి. కరోనా వైరస్‌ దెబ్బకు చైనాకు చెందిన కీలక ఆటోమొబైల్‌ సంస్థలు వెనుకడుగు వేయగా..మిగతా కంపెనీలు మాత్రం జోష్‌ పెంచాయి. చైనాకు చెందిన గ్రేట్‌ వాల్‌ మోటార్‌..భారత్‌లో బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడం విశేషం. ఈ ఆటో ఎక్స్‌పోలో మారుతి, హ్యుందాయ్‌, టాటా మోటర్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, రెనో, మెర్సిడెజ్‌-బెంజ్‌, ఫోక్స్‌వ్యాగెన్‌, స్కోడా, కియా, హెక్టార్‌లు తమ నూతన కార్లను ప్రదర్శించాయి. వీటిలో అత్యధికంగా విద్యుత్‌తో నడిచే కార్లు ఉన్నాయి. కరోనా వైరస్‌ ధాటికి అత్యధిక మంది మాస్క్‌లు ధరించి పాల్గొనడం విశేషం.

భారత్‌లో ఎంజీ రెండో ప్లాంట్‌


భారత్‌లో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ ఎంజీ మోటార్‌ ఇండియా. ఇప్పటికే గుజరాత్‌లోని హలోల్‌లో జనరల్‌ మోటార్స్‌కు ఉన్న ప్లాంట్‌ను కొనుగోలు చేసిన సంస్థ..మరో యూనిట్‌ను నెలకొల్పే అవకాశాలున్నాయని కంపెనీ ఇండియా ప్రెసిడెంట్‌, ఎండీ రాజీవ్‌ చాబా తెలిపారు. ఈ యూనిట్‌లో ఏడాదికి లక్ష కార్లు ఉత్పత్తి అవుతుండగా, 2022 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 2 లక్షలకు పెంచుకోనున్నట్లు ప్రకటించారు. నూతన ప్లాంట్‌కు సంబంధించి వచ్చే మూడు నుంచి నాలుగు  నెలల్లో కొలిక్కి రానున్నట్లు చెప్పారు.  


బెంజ్‌ నుంచి సరికొత్త కౌప్‌


జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌..దేశీయ మార్కెట్లోకి రూ.2.42 కోట్ల విలువైన ఏఎంజీ జీటీ 63ఎస్‌ 4 మ్యాటిక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గంటకు 315 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు కేవలం ఐదు సెకండ్లలో 100 వేగాన్ని అందుకోనున్నది. నాలుగు డోర్లు కలిగిన ఈ కారును నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏప్రిల్‌లో దేశీయ విపణిలోకి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఈక్యూసీని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది కూడా. 


కియా నుంచి కార్నివాల్‌


దక్షిణకొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా మోటర్స్‌..బుధవారం ప్రీమియం మల్టీ పర్పస్‌ వాహనమైన కార్నివాల్‌ను విడుదల చేసింది. మూడు రకాల్లో లభించనున్న ఈ కారు రూ.24.95 లక్షలు మొదలుకొని రూ.33.95 లక్షల లోపు ధరను నిర్ణయించింది సంస్థ. ప్రస్తుత సంవత్సరం రెండో అర్ధభాగంలో విడుదల చేయనున్న సోనెట్‌ కాన్సెప్ట్‌ కారును సైతం ఆటోమొబైల్‌ ఎక్స్‌పోలో ప్రదర్శించింది.  సెల్టాస్‌తో దేశీయ ఆటోమొబైల్‌ రంగంలోకి ప్రవేశించిన కియాకు కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. 


మహీంద్రా నుంచి ఈకేయూవీ 100

  • 8.25 లక్షలు


దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ కాంప్యాక్ట్‌ కారైన కేయూవీ100ని అందుబాటులోకి తీసుకొచ్చింది  ఈ కారు ధరను రూ.8.25 లక్షలుగా నిర్ణయించింది. దేశీయంగా లభిస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్‌ కారు ఇదేనని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఒక్కసారి చార్జితో 145 కిలోమీటర్ల ప్రయాణించనున్న ఈ కారు కేవలం గంట వ్యవధిలో 80 శాతం బ్యాటరీ రీచార్జి కానున్నది. 


రెండేండ్లలో మరో నాలుగు కార్లు: టాటా


ఆటోమొబైల్‌ రంగంపై మరింత పట్టు సాధించడానికి టాటా మోటర్స్‌ పావులు కదుపుతున్నది.   వచ్చే రెండేండ్లకాలంలో దేశీయ మార్కెట్లోకి నాలుగు కార్లను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. వీటిలో ఎలక్ట్రిక్‌ కారుతోపాటు ఎస్‌యూవీ, విద్యుత్‌తో నడిచే బస్సు, ట్రక్కులు కూడా ఉన్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆటో ఎక్స్‌పోలో 26 నూతన ఉత్పత్తులను ప్రదర్శించింది. వీటిలో 14 కమర్షియల్‌ వాహనాలు కాగా, 12 ప్యాసింజర్‌ వాహనాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలను విక్రయించడానికి ప్రత్యేక అవుట్‌లెట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ ప్రకటించారు. 


10 లక్షల కాలుష్య రహిత కార్లు విక్రయిస్తాం: మారుతి


కాలుష్య రహిత వాహనాలపై మారుతి సుజుకీ దృష్టి సారించింది. వచ్చే కొన్నేండ్లలో పది లక్షల యూనిట్లను భారత్‌లో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. వీటిలో సీఎన్‌జీ, స్మార్ట్‌ హైబ్రిడ్‌, విద్యుత్‌తో నడిచే వాహనాలు ఉన్నాయని మారుతి ఎండీ, సీఈవో కెనిచి అయుకవా తెలిపారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న విద్యుత్‌తో నడిచే వాహనాలపై విధించే కస్టమ్స్‌ డ్యూటీని పెంచడమేంటని మారుతి సుజుకీ ప్రశ్నించింది. సుంకం పెంచడం వల్ల దేశీయంగా విద్యుత్‌తో నడిచే కార్లను తయారు చేయడం అంత సులభతరం కాదని మారుతి ఎండీ, సీఈవో కెనిచి అయుకవా వ్యాఖ్యానించారు. కమర్షియల్‌ ఈవీలపై దిగుమతి సుంకాన్ని 25 శాతం నుంచి 40 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 


స్కోడా నుంచి కాన్సెప్ట్‌


ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ స్కోడా..దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసిన మధ్యస్థాయి ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ కారును ఆవిష్కరించింది. వచ్చే ఏడాది విడుదల చేయనున్న ఈ కారును ఇండియా 2.0 ప్రాజెక్టులో భాగంగా తయారు చేసినట్లు కంపెనీ ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ జాక్‌ హోల్లియస్‌ తెలిపారు. వచ్చే మూడేండ్లకాలంలో దేశీయంగా వ్యాపారాన్ని విస్తరించడానికి 150 నగరాల్లో 200 విక్రయ, సర్వీసింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సంస్థ రూ.8 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నది. 


కోనా ధరను పెంచం: హ్యుందాయ్‌

  • 23.71 లక్షలు


ఎలక్ట్రిక్‌ వాహనమైన కోనా మోడల్‌ ధరను పెంచబోమని హ్యుందాయ్‌ మోటార్‌ ప్రకటించింది. ఎలక్ట్రిక్‌ వాహనాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ కారు ధరను పెంచే ఉద్దేశమేది లేదని హ్యుందాయ్‌ ఎండీ, సీఈవో ఎస్‌ఎస్‌ కిమ్‌ తెలిపారు. మేక్‌ ఇన్‌ ఇండియాను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం కోనా కారు రూ.23.71 లక్షలకు లభించనున్నది.   • ఎక్స్‌పో ఆకట్టుకున్నద్విచక్ర వాహనం వెస్పా


logo