శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Jan 29, 2020 , 23:49:22

లంబోర్ఘిని @ 3.22 కోట్లు

లంబోర్ఘిని @ 3.22 కోట్లు

న్యూఢిల్లీ, జనవరి 29: ఇటలీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని..మార్కెట్లోకి రూ.3.22 కోట్ల ధర కలిగిన హ్యురకేన్‌ ఎవోను ప్రవేశపెట్టింది. వీ10 ఇంజిన్‌తో తయారైన ఈ కారు 610 హెచ్‌పీల శక్తిని ఇవ్వనున్నది. కేవలం 3.3 సెకండ్లలో సున్న నుంచి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్న ఈ కారు గంటకు 325 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా హెడ్‌ శరద్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ..దేశీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ ఏడాది రెండంకెల వృద్ధి సాధించే అవకాశాలున్నాయన్నారు. గతేడాది సంస్థ 15 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. ఆటోమొబైల్‌ రంగం సాధిస్తున్న వృద్ధికంటే సంస్థ మెరుగైన వృద్ధిని సాధిస్తున్నదన్న నమ్మకాన్ని వ్యక్తంచేసిన ఆయన...నిరాశాజనక ఆర్థిక పరిస్థితులు నెలకొనడంతో కార్ల కొనుగోలును వాయిదావేస్తున్నట్లు చెప్పారు. ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధిరేటుకు ఊతమివ్వడానికి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌లో కేంద్రం తీసుకోనున్న నిర్ణయాలు కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. 

బెంజ్‌ జీఎల్‌ఈ ధర 73.70 లక్షలు

 జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌-బెంజ్‌..మార్కెట్లోకి నూతన లాంగ్‌ వీల్‌ కలిగిన జీఎల్‌ఈ ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రకాల్లో లభించనున్న ఈ మోడళ్లలో ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ 300 డీ ధర రూ.73.70గా నిర్ణయించిన సంస్థ..ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ 400 డీ ధరను రూ. 1.25 కోట్లుగా నిర్ణయించింది. వినియోగదారుల అభిరుచి మేరకు కార్లను తయారు చేయడం సంస్థకు తెలుసునని, బుధవారం ప్రవేశపెట్టిన జీఎల్‌ఈ మోడల్‌ కూడా ఇదేనని కంపెనీ ఎండీ, సీఈవో మార్టిన్‌ స్కేవెంక్‌ తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన తొలి కారు ఇదేనని, ఈ ఏడాది కూడా పదింటికి పైగా మోడళ్ళను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇదివరకే జీఎల్‌ఈ మోడల్‌ 13 వేల యూనిట్లు భారత్‌లో అమ్ముడయ్యాయని, ఈ నూతన మోడల్‌ కూడా కొనుగోలుదారులను ఆకట్టుకునేదానిపై ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు


logo