శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 10, 2021 , 03:00:06

రూ.2 లక్షలు దాటితే కేవైసీ తప్పనిసరి

రూ.2 లక్షలు దాటితే కేవైసీ తప్పనిసరి

  • ఆభరణాల కొనుగోళ్లపై ఆర్థిక వర్గాల స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 9: ఎక్కువ మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారా అయితే..మీరు ఖచ్చితంగా కేవైసీ సమర్పించాల్సి ఉంటుంది. రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారం, వెండి, విలువైన రత్నాలు, రాళ్ళు కొనుగోలు లావాదేవీలపై తప్పనిసరిగా పాన్‌(పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌), కేవైసీ(నో యువర్‌ కస్టమర్‌) వివరాలను ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టంచేశాయి. రూ.2 లక్షల లోపు నగదు లావాదేవీలు జరిపేవారు మాత్రం ఈ వివరాలను సమర్పించాల్సిన అవసరం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేంద్ర ప్రభుత్వం గత నెల 28న జారీ చేసిన నోటిఫికేషన్‌పై ఆర్థిక శాఖ వర్గాలు ఈ మేరకు వివరణ ఇచ్చాయి. బంగారం, ఆభరణాలు, రత్నాల కొనుగోళ్ల కోసం కేవైసీ లేకుండా రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపేందుకు గత కొన్ని సంవత్సరాల నుంచి అనుమతించడం లేదని, ఈ విధానం ఇలాగే కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం స్పష్టం చేసింది. డిసెంబర్‌ 28న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో బంగారం, వెండి, ఆభరణాలు, రత్నాలను కొనుగోలుచేసే వ్యక్తులు, సంస్థలు విధిగా కేవైసీ పత్రాలను నింపాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి. కానీ కేవైసీకి సంబంధించిన కొత్త నిబంధనలు అందరికీ వర్తించవని, రూ.2 లక్షలు లేదా కంటే ఎక్కువ మొత్తంతో బంగారం, వెండి, ఆభరణాలు, రత్నాలను కొనుగోలు చేసేవారంతా విధిగా కేవైసీ వివరాలను సమర్పించాల్సిందేనని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.  

VIDEOS

logo