శుక్రవారం 10 జూలై 2020
Business - Jun 03, 2020 , 23:56:42

ఆర్థిక మంత్రిగా కామత్‌?

ఆర్థిక మంత్రిగా కామత్‌?

  • పరిశీలిస్తున్న కేంద్రం

న్యూఢిల్లీ, జూన్‌ 3: నిర్మలా సీతారామన్‌ స్థానంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా సీనియర్‌ బ్యాంకర్‌ కేవీ కామత్‌ రానున్నారా? ఈ ప్రశ్నకు ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. బ్రిక్స్‌ దేశాల న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్డీబీ) చీఫ్‌గా ఇటీవలే ఐదేండ్లు పూర్తిచేసుకున్న కామత్‌.. వచ్చే నెలలో ఆ బాధ్యతల్ని మరొకరికి అప్పగించనున్నారు. దీంతో కామత్‌ ఆర్థిక మంత్రి పదవిని చేపట్టనున్నారన్న ఊహాగానాలకు ఊతమిస్తున్నది.

ఈ మార్పు దేనికి?

దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ తీవ్రంగా దెబ్బతీసింది. అసలే మందగమనంలో ఉన్న ఎకానమీని ఈ మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదిప్పుడు. దీంతో పరిస్థితులను చక్కదిద్దడంలో విఫలమయ్యారన్న విమర్శలను ప్రతిపక్షాల నుంచి మోదీ సర్కారు ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ పగ్గాలను మరింత సమర్థుల చేతికి అప్పగించాలన్న నిర్ణయానికి ప్రధాని మోదీ వచ్చినట్లు తెలుస్తున్నది. ఇక అంబానీలతో ఉన్న సత్సంబంధాలూ కామత్‌ను ఆర్థిక మంత్రి రేసులో ముందుంచుతున్నాయి. ముకేశ్‌, అనిల్‌ అంబానీల ఆస్తుల పంపకాల్లో కామత్‌ పెద్ద దిక్కుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

నిర్మలపై వేటువేస్తున్నారా?

భారత తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ చరిత్ర సృష్టించారు. బీజేపీ సీనియర్‌ నాయకురాలిగా ఉన్న నిర్మలకు ప్రభుత్వంలో మంచి పేరే ఉన్నది. అయితే వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన మోదీ సర్కారుకు ఈసారి ఆర్థిక పరిస్థితులు అస్సలు అనుకూలించడం లేదు. తొలి ఐదేండ్లు దూసుకుపోయిన జీడీపీ.. మలి దఫా ఆరంభంలోనే పడకెక్కేసింది. పాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సెగలతో బక్కచిక్కిపోయిన వృద్ధిరేటును కరోనా చంపేస్తున్నది. ఈ క్రమంలో జీడీపీ బలోపేతానికే కేంద్రం తొలి ప్రాధాన్యతను ఇస్తున్నది. అందుకే ఆర్థిక మంత్రిగా అనుభవజ్ఞుల్ని పెట్టాలని కేంద్రం చూస్తున్నట్లు సమాచారం. కాగా, ఇప్పుడున్న కార్పొరేట్‌ వ్యవహారాల శాఖను నిర్మలకే కేటాయించే అవకాశాలున్నాయి.

రుణాల మంజూరులో అవినీతి ఆరోపణలు

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌గా బ్యాంకింగ్‌ రంగంలో విశేష అనుభవం ఉన్న కామత్‌పై అవినీతి ఆరోపణలుండటం ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రి అవకాశాలకు ప్రతిబంధకంగా మారింది. ఎన్డీటీవీ ప్రమోటర్‌ ప్రణయ్‌ రాయ్‌ మోసం చేసి తీసుకున్న రుణాలు, బ్యాంక్‌ వివాదాస్పద సీఈవో చందా కొచ్చర్‌ ముడుపులు తీసుకుని ఇచ్చారంటున్న రుణాల కేసుల్లో కామత్‌ అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కామత్‌ కోసం అటు సీబీఐ, ఇటు ఈడీ ఎదురుచూస్తున్నాయి.


logo