గురువారం 09 ఏప్రిల్ 2020
Business - Feb 19, 2020 , 00:22:53

మూసివేత

మూసివేత
  • వొడాఫోన్‌ ఐడియాపై ఏజీఆర్‌ పిడుగు
  • రూ.53 వేల కోట్ల బకాయిలు చెల్లించలేక సతమతం
  • దివాలా తీస్తుందన్న అనుమానాలు
  • సంస్థ రుణ భారం రూ.1.16 లక్షల కోట్లపైనే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశీయ టెలికం రంగాన్ని ఏజీఆర్‌ బకాయిలు కుదిపేస్తున్నాయి. పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న భారతీయ టెలికం సంస్థలపై సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) పిడుగులా పడింది. వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌పై అత్యధికంగా రూ.53,038 కోట్ల భారం పడగా, ఇప్పుడీ బాకీలను తీర్చడం సంస్థకు తలకు మించిన పనిగా పరిణమించింది. దీంతో సంస్థ మనుగడపైనే ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. మొత్తం 15 సంస్థలు టెలికం శాఖకు ఇవ్వాల్సిన ఏజీఆర్‌ బకాయిలు రూ.1.47 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో స్పెక్ట్రం వినియోగ చార్జీల బకాయిలు రూ.55,054 కోైట్లెతే, లైసెన్స్‌ ఫీజు బాకీలు రూ.92,642 కోట్లు. వొడాఫోన్‌ ఐడియా వాటా రూ.53,038 కోట్లుగా ఉన్నది. ఇందులో రూ.24,729 కోట్లు స్పెక్ట్రం బకాయిలవగా, మరో రూ.28,309 కోట్లు లైసెన్స్‌ ఫీజు. 


కష్టమ్మీద రూ.2,500 కోట్లు చెల్లింపు

సోమవారం రాత్రికిగానీ అతి కష్టమ్మీద టెలికం శాఖకు రూ.2,500 కోట్లు డిపాజిట్‌ చేసిన సంస్థ.. శుక్రవారంలోగా మరో వెయ్యి కోట్ల రూపాయలను ఇస్తామని చెప్పింది. ఏజీఆర్‌ బకాయిల విషయంలో తామిచ్చిన తీర్పుపై టెలికం శాఖ డెస్క్‌ అధికారి స్టే విధిస్తారా అంటూ గత శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం మండిపడిన నేపథ్యంలో సర్కిళ్లు, జోన్లవారీగా టెలికం శాఖ అదేరోజున తాఖీదులను జారీ చేసింది. వెంటనే బాకీలు తీర్చకపోతే లైసెన్స్‌ నిబంధనల ప్రకారం తదుపరి నోటీసులు ఇవ్వకుండానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో సోమవారం ఎయిర్‌టెల్‌ రూ.10 వేల కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.2,500 కోట్లు, టాటా టెలీసర్వీసెస్‌ రూ.2,197 కోట్లు చెల్లించాయి. మిగతా బకాయిలు సుప్రీం ఇచ్చిన గడువు మార్చి 17కల్లా తీరుస్తామని విజ్ఞప్తి చేశాయి. కానీ వొడాఫోన్‌ ఐడియా మాత్రం తమ వల్ల కాదన్న సంకేతాలను ఇస్తున్నది. 


సుప్రీంలో ఊరట కరువు

ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుపై సోమవారం సుప్రీం కోర్టుకు వొడాఫోన్‌ ఐడియా ఓ ప్రతిపాదన చేయగా, అది తిరస్కరణకు గురైంది. సోమవారం రూ.2,500 కోట్లు, శుక్రవారం మరో రూ.1,000 కోట్లు ఇస్తామన్న సంస్థ.. తమపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని విజ్ఞప్తి చేసింది. కానీ ఇందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు. నిజానికి గత నెల 23కల్లా ఏజీఆర్‌ బకాయిలన్నింటినీ తీర్చాలని టెలికం సంస్థలకు నిరుడు అక్టోబర్‌లో సుప్రీం గడువిచ్చింది. అయినప్పటికీ ఆ దిశగా అడుగులు పడకపోవడంతో ఈ నెల 14న ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగానే సోమవారం దాదాపు రూ.15 వేల కోట్లు వసూలవగా, మిగతా చెల్లింపుల్లో తాము కోరిన వెసులుబాటు లభించకపోతే వొడాఫోన్‌ ఐడియా చేతులెత్తేసేలాగానే కనిపిస్తున్నది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కొద్దిరోజుల క్రితం సంస్థ నుంచి స్పష్టమైన ప్రకటన కూడా వెలువడింది. సుప్రీం కోర్టులో తాము దాఖలు చేసిన అభ్యర్థనపై వచ్చే తీర్పే భారత్‌లో సంస్థ భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. ఇక గతేడాది డిసెంబర్‌ 31 నాటికి సంస్థ రుణ భారం రూ.1,15,850 కోట్లుగా ఉన్నది. ఇందులో రూ.88,530 కోట్ల వాయిదా వేసిన స్పెక్ట్రం బకాయిల చెల్లింపులుండగా, లీజు బకాయిలు మాత్రం అదనంగా ఉన్నాయి. 


టెలికం కార్యదర్శితో బిర్లా భేటీ

టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాశ్‌తో మంగళవారం వొడాఫోన్‌ ఐడియా చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా సమావేశమైయ్యారు. ఏజీఆర్‌ బకాయిలను తీర్చేందుకు నానా తంటాలు పడుతున్న సంస్థ.. బ్యాంక్‌ గ్యారెంటీలను నగదుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యతను సంతరించుకోగా, గంటకుపైగా జరిగిన ఈ సమావేశ వివరాలను చెప్పేందుకు బిర్లా నిరాకరించారు. ‘నేనిప్పుడు ఏం మాట్లాడలేను’ అని విలేకరులతో అంటూ వెళ్లిపోయారు. ఆయన వెంట వొడాఫోన్‌ ఐడియా ఎండీ, సీఈవో రవీందర్‌ టక్కర్‌ కూడా ఉన్నారు. రెండు త్రైమాసికాల లైసెన్స్‌ ఫీజు, ఇతరత్రా బకాయిలకు ఈ బ్యాంక్‌ గ్యారెంటీ సమానం. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలకు ఇది రూ.5,000 కోట్ల శ్రేణిలో ఉండే వీలున్నది. దీంతో ఈ మొత్తం చేతికందితే బకాయిలను తీర్చడంలో కొంతైనా ఉపశమనం ఉంటుందని వొడాఫోన్‌ ఐడియా ఆలోచన. రిలయన్స్‌ జియో రాకతో భారతీయ టెలికం రంగ ముఖచిత్రం మారిపోగా, ధరల యుద్ధంతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాల ఆదాయం ఆవిరైపోయింది. ఈ క్రమంలో ఏజీఆర్‌ బకాయిలు గుదిబండలా మారాయి. ఎయిర్‌టెల్‌ బకాయిలు రూ.35 వేల కోట్లకుపైగా ఉండగా, వొడాఫోన్‌ ఐడియా దివాలా తీస్తే.. దేశంలో ఇక మిగిలే ప్రైవేట్‌ రంగ సంస్థలు ఎయిర్‌టెల్‌, జియోలే కావడం గమనార్హం.


logo