Birla Meets Ashwini Vaishnaw | ఆదిత్య బిర్లా గ్రూప్ (ఏబీజీ) చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా.. కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. వొడాఫోన్ ఐడియా (వీఐ) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన నెల రోజులకు కేంద్ర మంత్రితో బిర్లా బుధవారంతో భేటీ కావడం గమనార్హం. అప్పుల ఊబిలో చిక్కుకున్న టెలికం రంగాన్ని ఆదుకునేందుకు ఉద్ధీపన
చర్యలను ప్రకటించే అంశాన్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తున్నదని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, బిర్లా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
కేంద్రమంత్రి వైష్ణవ్, కుమార్ మంగళం బిర్లా ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్న సంగతి ఇతమిద్దంగా తెలియరాలేదు. సంక్షోభంలో చిక్కుకున్న టెలికం రంగాన్ని ఆదుకోవడానికి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించేందుకు టెలికం శాఖ (డీవోటీ), ఆర్థిక శాఖ రంగం సిద్ధం చేసిన టైంలో వారు సమావేశం కావడమే కీలకం.
టెలికం రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయడానికి కేంద్రం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడానికి కొన్ని నెలల టైం పడుతుందని తెలుస్తోంది. కొన్ని రోజుల్లోనే గానీ, ఆలస్యంగా గానీ ప్యాకేజీ ప్రకటన వస్తుందని అధికార వర్గాలను ఉటంకిస్తూ.. ఓ ఆంగ్ల దినపత్రిక వార్త కథనం ప్రచురించింది.
అప్పుల ఊబిలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ సంస్థలు బకాయి పడిన సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) చెల్లింపుల గడువును 20 ఏండ్లకు పొడిగించేందుకు అవసరమైన మెకానిజాన్ని కేంద్రం సిద్ధం చేస్తున్నట్లు వినికిడి. దీనిపై న్యాయశాఖ అభిప్రాయం కోరినట్లు తెలుస్తోంది.
లైసెన్స్ ఫీజు తగ్గించడంతోపాటు వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రం బకాయిల చెల్లింపులపై మారటోరియం మరో రెండేండ్లు పొడిగించేందుకు టెలికం శాఖ సిద్ధమైంది. ప్రత్యేకించి పూర్తిగా అప్పుల ఊబిలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియాకు లైఫ్ లైన్ ఇవ్వడానికి రిలీఫ్ ప్యాకేజీ సిద్ధం చేసిందని సమాచారం. తద్వారా కొత్తగా ఇన్వెస్టర్ల నుంచి వొడాఫోన్ ఐడియా నిధుల సేకరణకు వెసులుబాటు కలుగుతుందని అంచనా.
జూన్‌తో ముగిసిన త్రైమాసికం నాటికి వొడాఫోన్ ఐడియా వద్ద కేవలం రూ.920 కోట్ల నగదు మాత్రమే ఉంది. సంస్థ రుణాలు రూ.1.92 లక్షల కోట్లు. ఇందులో స్పెక్ట్రం వేలం, ఏజీఆర్ బకాయి చెల్లింపులు ఉన్నాయి. గతేడాది రూ.25 వేల కోట్ల నిధులను సేకరించడానికి వొడాఫోన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో నిరాశా నిస్పృహల మధ్య వొడాఫోన్ ఐడియా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి కుమార్ మంగళం బిర్లా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన వాటాను కూడా విక్రయించడానికి సిద్ధమని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Pawan : పవన్ బర్త్ డే: క్రేజీ అప్డేట్ ఇచ్చిన హరిహర వీరమల్లు టీం
భీకర వానలతో న్యూయార్క్ అస్తవ్యస్తం..
wireless charging room | గాలితోనే మీ ఫోన్ చార్జింగ్ చేసుకోవచ్చు.. ఎలా?
Instagram Down : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. సర్వర్ డౌన్.. పనిచేయని యాప్