సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jun 28, 2020 , 01:28:46

పిరమల్‌తో కైర్లెల్‌ జట్టు

పిరమల్‌తో కైర్లెల్‌ జట్టు

  • 20 శాతం వాటా కొనుగోలు చేయనున్న సంస్థ
  • ఒప్పందం విలువ రూ.3,700 కోట్లు

న్యూఢిల్లీ, జూన్‌ 27: అమెరికాకు చెందిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ కైర్లెల్‌ గ్రూపు ఇండస్ట్రీస్‌..పిరమల్‌ ఫార్మాతో జతకట్టింది. 490 మిలియన్‌ డాలర్లతో 20 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నట్లు శనివారం ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.3,700 కోట్లకు పైమాటే. ఫార్మా రంగంలో తనదైన ముద్ర వేయడానికి ఈ నిధులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అజయ్‌ పిరమల్‌ నేతృత్వం వహిస్తున్న పిరమల్‌ గ్రూపు తాజాగా ప్రకటించింది. పిరమల్‌ గ్రూపునకు చెందిన ఫార్మా వ్యాపారం విలువ 2.775 బిలియన్‌ డాలర్లుగాను(రూ.20,980 కోట్లకు పైమాటే) గుర్తించింది. మార్చి 31 నాటికి కంపెనీకి ఉన్న అప్పులు, ఎక్సేంజ్‌ రేట్‌ ఆధారంగా ఈ ఒప్పందం కుదిరిందని, ఈక్విటీ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కింద పిరమల్‌ ఫార్మాలో కైర్లెల్‌ 20 శాతం వాటాను కైవసం చేసుకోనున్నట్లు ప్రకటించింది. 

ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ వాటా విక్రయ ఒప్పందం ఈ ఏడాది చివరినాటి వరకు పూర్తికానున్నట్లు వెల్లడించింది. నూతన రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ ఒప్పందం దోహదం చేయనున్నదని పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ అజయ్‌ పిరమల్‌ తెలిపారు. ఈ నిధులతో బ్యాలెన్స్‌ షీట్‌ మెరుగుపడగలదని, సంస్థ వ్యూహాత్మకంలో భాగంగా నెక్స్‌ ఫేజ్‌కు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ  ఒప్పందం తర్వాత కూడా పిరమల్‌ ఫార్మాలో పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు అత్యధిక వాటా వుంటుందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ..80 శాతం వాటా వుంటుందన్నారు.

ఫార్మా, ఆర్థిక సేవల విభాగంలో సేవలు అందిస్తున్న పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌లను రెండుగా విడగొట్టాలనుకుంటున్నట్లు, ఆ తర్వాత స్టాక్‌ మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉందన్నారు. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయని పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఈడీ నందిని పిరమల్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కైర్లెల్‌ ఆసియా పార్టనర్స్‌ అడ్వైయిజరీ ఎండీ నీరజ్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ..ఫార్మా రంగంలో తనదైన ముద్ర వేస్తున్న పిరమల్‌ గ్రూపులో పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉన్నదని, ఫార్మా సొల్యుషన్స్‌, క్రిటికల్‌ కేర్‌, కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ విభాగంలో మరింత పట్టు సాధించడానికి ఇది దోహదం చేయనున్నదన్నారు.


logo