మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 07, 2020 , 02:29:42

కియా ప్రకంపనలు

కియా ప్రకంపనలు
  • ఏపీ నుంచి తరలిపోతున్నదని వార్తలు
  • తమిళనాడుతో చర్చలు జరుపుతున్నట్టు రాయిటర్స్ వెల్లడి
  • అలాంటిదేమీ లేదని కియా యాజమాన్యం స్పష్టీకరణ
  • తప్పుడు ప్రచారమని మండిపడిన ఏపీ ప్రభుత్వం
  • తరలింపుపై సమాచారం లేదన్న తమిళనాడు

అమరావతి, ఫిబ్రవరి 6: దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా ఆంధ్రప్రదేశ్ నుంచి తమ ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించనున్నట్టు జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో దాదాపు 110 కోట్ల డాలర్లతో ఏర్పాటుచేసిన ప్లాంట్‌ను పొరుగు రాష్ర్టానికి తరలించేందుకు కియా కంపెనీ తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నదని, గత ఏడాది నుంచి విధానపరంగా ఎదురవుతున్న ఇబ్బందులే ఇందుకు కారణమని ఈ చర్చలతో సంబంధమున్న వర్గాలు స్పష్టం చేశాయని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే ఈ వార్తలో నిజంలేదని కియా సంస్థతోపాటు ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు కొట్టిపారేశాయి. అనంతపురం జిల్లాలోని ప్లాంట్‌లో కియా గతేడాది ద్వితీయార్థం నుంచి కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రపంచంలోని అతిపెద్ద కార్ల మార్కెట్‌లో ఐదవదిగా ఉన్న భారత్‌లో కియా ఏర్పాటుచేసిన తొలి ప్లాంట్ ఇదే. ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యంతో ఏర్పాటైన ఈ ప్లాంట్ ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 12 వేల ఉద్యోగాలు సృష్టించింది. అయితే ఈ ప్లాంట్‌ను అనేకమంది ఆటోమొబైల్ విడిభాగాల సరఫరాదారులకు నెలవుగా ఉన్న తమిళనాడుకు తరలించేందుకు కియా యాజమాన్యం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపతున్నట్టు తమిళనాడు ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారితోపాటు, ఈ చర్చలతో సంబంధమున్న మరో అధికారి ధ్రువీకరించినట్టు రాయిటర్స్ పేర్కొన్నది. ఏపీలో కియా సంస్థ సమస్యలను ఎదుర్కొంటున్నది. ప్రస్తుతం వారు (కియా ప్రతినిధులు) మాతో ప్రాథమిక చర్చలు జరుపుతున్నారు. కియాకు అనుబంధంగా పనిచేస్తున్న హ్యుందాయ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. వచ్చేవారం కార్యదర్శుల స్థాయి సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుంది అని తమిళనాడు అధికారి వివరించినట్టు రాయిటర్స్ బుధవారం వెల్లడించింది. అయితే ఈ వార్తను కియా యాజమాన్యం తోసిపుచ్చింది. అనంతపురం జిల్లాలోని ప్లాంట్‌ను వేరే ప్రాంతానికి తరలించాలన్న ఆలోచనలేవీ లేవని స్పష్టంచేసింది. అయితే విధానపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల గురించి గానీ, తమిళనాడుతో చర్చలు జరుపుతున్నట్టు వస్తున్న వార్తల గురించి గానీ ఆ సంస్థ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. భారత మార్కెట్‌పై మాకు దీర్ఘకాలిక ప్రణాళికలున్నాయి. భారత్‌లో మా కార్యకలాపాలను మరింతగా విస్తరించాలన్న ఆలోచనకు ముందు ఏపీలోని ప్లాంట్ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం అని కియా సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 

తప్పుడు ప్రచారం: బుగ్గన

అనంతపురం జిల్లా నుంచి కియా ప్లాంట్ తరలింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తను ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తమ ప్రభుత్వంపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గురువారం ఆయన ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాయిటర్స్ వార్తా కథంనలో నిజంలేదని, కియా విషయంలో కొందరు కావాలనే గందరగోళం సృష్టించారని చెప్పారు. త్వరలో బిర్లా, ఏటీసీ టైర్స్, స్మార్ట్‌టెక్ టెక్నాలజీస్ లాంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టబోతున్నాయని తెలిపారు. ఏపీ నుంచి కియా ప్లాంట్ తరలిపోతున్నదంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి మండిపడ్డారు. కియా ప్లాంట్ ఎక్కడికీ తరలిపోవడంలేదని, గురువారం ఉదయమే తాను కియా ఎండీతో మాట్లాడానని ఆయన లోక్‌సభలో స్పష్టం చేశారు. కియా ప్లాంట్ తరలింపుపై లోక్‌సభలో టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగించాలని మిథున్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు. రాయిటర్స్ వార్తాకథనంపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది. కియా ప్రతినిధులతో తాము చర్చలు జరుపలేదని, ఏపీలోని ప్లాంట్ తరలింపుపై ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నది.


logo
>>>>>>