సోమవారం 08 మార్చి 2021
Business - Jan 31, 2021 , 22:18:30

నేడే బడ్జెట్!: సీతమ్మ సరైన మందు వేస్తారా?!

నేడే బడ్జెట్!: సీతమ్మ సరైన మందు వేస్తారా?!

న్యూఢిల్లీ: వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రాని (2021-22)కి వార్షిక బ‌డ్జెట్ మ‌రికొన్ని గంట‌ల్లో కేంద్ర విత్త‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. క‌రోనాతో అత‌లాకుత‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్ట‌డంతోపాటు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మెప్పు పొంద‌డం ఆర్థిక మంత్రి ముందు ఉన్న స‌వాళ్లు. కరోనా మహమ్మారితో సతమతమైన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి, ప్రజా సంక్షేమానికి బడ్జెట్ లో సరైన టీకా మందు వేస్తారా?  అన్ని వర్గాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొవిడ్‌-19 మ‌హమ్మారి నేప‌థ్యంలో సోమ‌వారం గ‌‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ‘నెవ‌ర్ బిఫోర్ లైక్‌’ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. 

రుణాల‌పై మార‌టోరియం.. పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ 

రుణాల‌పై మార‌టోరియంతోపాటు భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధానం, రుణాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌, ఆర్థిక రంగానికి ఉన్న అవ‌రోధాల‌ను అధిగ‌మించాల్సి ఉంది. క‌రోనా లాక్‌డౌన్‌తో ప‌లు రంగాలు కుదేల‌య్యాయి. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం ప‌త‌న‌మైంది. మ‌హ‌మ్మారికి ముందు నెల‌కొన్న ఆర్థిక మాంద్యం వ‌ల్ల 2019-20లో జీడీపీ.. పుష్క‌ర కాల క‌నిష్టం 4.2 శాతాన్ని తాకింది. మ‌హ‌మ్మారి.. దానికి ముందు ఆర్థిక మంద‌గ‌మ‌నం వ‌ల్ల వివిధ రంగాలు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన‌ ఆర్థిక, ద్ర‌వ్య‌ ప‌ర‌మైన ఒత్తిళ్ల‌ను నిర్మ‌లా సీతారామ‌న్ త‌న బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లో ప‌రిష్క‌రించాల్సి ఉంది. 

ఆరోగ్య రంగానికి మౌలిక వ‌స‌తుల బ‌లోపేతం

దేశీయంగా ఆరోగ్య మౌలిక వ‌స‌తులు పేల‌వంగా ఉన్నాయ‌ని విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించిన కొవిడ్ మ‌హ‌మ్మారి వ‌ల్ల వెల్ల‌డైంది. ఈ నేప‌థ్యంలో నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్‌కు నిధుల కేటాయింపులు పెరుగాల్సి ఉంది. ప్ర‌జారోగ్య మౌలిక వ‌స‌తుల బ‌లోపేతం దిశ‌గా నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ ఫోక‌స్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. జీడీపీలో 2.5 నుంచి మూడు శాతం వ‌ర‌కు హెల్త్‌కేర్ రంగానికి నిధుల కేటాయింపులు పెరుగుతాయ‌ని ఎక‌న‌మిక్ స‌ర్వే 2021 సంకేతాలిచ్చింది. 

వినియోగ‌దారుల్లో డిమాండ్ పున‌రుద్ధ‌ర‌ణ‌

క‌రోనా లాక్‌డౌన్‌తో భ‌వ‌న నిర్మాణ రంగం, ప‌ర్యాట‌కం, ఆతిథ్యం స‌హా ప‌లు రంగాలపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డింది. ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మైన బ్యాంకుల రుణ ప‌ర‌ప‌తి త‌క్ష‌ణం పెంపొందించడం ద్వారానే వినియోగ‌దారుల్లో డిమాండ్ పున‌రుద్ధ‌రించ‌డానికి అవ‌కాశాలు ఉన్నాయి. 

బ్యాంకింగ్ రంగంలో సంస్క‌ర‌ణ‌లు

ఆర్థిక రంగంలో ప్ర‌త్యేకించి ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్‌లో అత్య‌వ‌స‌రంగా సంస్క‌ర‌ణ‌లు తేవాల్సిన అవ‌స‌రం ఉంది. రుణాల చెల్లింపుల‌పై దీర్ఘ‌కాలం మార‌టోరియం విధించ‌డంతోపాటు కామ‌త్ క‌మిటీ సిఫార‌సుల‌కు అనుగుణంగా రుణాలను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించాల్సి ఉంది.

బ‌డ్జెట్‌లో స‌మ‌తుల్య‌త‌

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో బ‌డ్జెట్ ల‌క్ష్యాల‌ను దాటి ఇప్ప‌టికే ప్ర‌భుత్వ రుణాలు రూ.5 ల‌క్ష‌ల కోట్లు దాటాయి. దీనికి తోడు రెవెన్యూ వ‌సూళ్లు తగ్గ‌డంతో రాష్ట్రాలు మ‌రో రూ.4 ల‌క్ష‌ల కోట్ల రుణాలు తీసుకునేందుకు కేంద్రం అనుమ‌తించింది. అయితే, గ‌త అక్టోబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు జీఎస్టీ రెవెన్యూ వ‌సూళ్లు రూ. ల‌క్ష కోట్ల నుంచి రూ.1.15 ల‌క్షల కోట్ల‌కు పెరిగాయి. దీంతోపాటు ద్ర‌వ్య‌లోటును ఎలా క‌ట్ట‌డి చేస్తారో నిర్మ‌లా సీతారామ‌న్ త‌న బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లో స‌మ‌ర్పించ‌నున్నారు. 

పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ల‌క్ష్యం

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.2.10 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో వాటాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేంద్రం ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకున్నది. ఎల్ఐసీలో ఐపీవో, ఐడీబీఐలో వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌తోపాటు రూ.90వేల కోట్ల ఉప‌సంహ‌ర‌ణ ల‌క్ష్యం నెర‌వేర‌లేదు. ప్ర‌భుత్వ రంగ విమాన‌యాన‌సంస్థ ఎయిర్ఇండియా విక్ర‌య ప్ర‌క్రియ క‌రోనా వ‌ల్ల జాప్య‌మైంది. వచ్చే ఏడాది ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ ల‌క్ష్యాల‌ను విత్త‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఎలా నిర్ణ‌యిస్తార‌న్న‌ది వేచి చూడాల్సి ఉంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo