గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Jan 20, 2020 , 01:13:19

దేశ జీడీపీకి దెబ్బే!

దేశ జీడీపీకి దెబ్బే!
  • 5జీలో హువావీని వద్దంటే భారీ నష్టం
  • 2035 నాటికి కనీసం రూ.33 వేల కోట్లు నష్టపోయే ప్రమాదం
  • విపరీతంగా పెరుగనున్న పెట్టుబడి వ్యయం

న్యూఢిల్లీ, జనవరి 19: చైనా టెలికం దిగ్గజం హువావీపై నిషేధం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్నే షేక్‌ చేయనుంది. ముఖ్యంగా భారత జీడీపీపై పెను భారమే పడనున్నది. భద్రతాపరమైన ఆందోళనలతో తమ దేశ 5జీ టెక్నాలజీ రంగంలోకి అమెరికా, ఆస్ట్రేలియాలు హువావీని రాకుండా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, బ్రిటన్‌ దేశాల్లోనూ హువావీ 5జీ సేవలపై అనుమానాలు నెలకొన్నాయి. పాక్షికంగా ఆంక్షలు పెట్టాలా?.. లేదా విడిచిపెట్టాలా?.. అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. అయితే భారత్‌లో జరిగే 5జీ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు హువావీకి కేంద్రం అనుమతినిచ్చింది.

ఈ క్రమంలో ఈ ఎనిమిది దేశాల మార్కెట్లపై ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ ఓ అధ్యయనం జరిపింది. ఇందులో భారత ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టమే జరుగవచ్చన్న అంచనాలున్నాయి. 5జీ సేవల్లో పాల్గొనకుండా హువావీపై నిషేధం విధిస్తే 2035 నాటికి భారత్‌కు కనీసం 4.7 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.33 వేల కోట్లు) నష్టం రావచ్చని అంటున్నారు. గరిష్ఠంగా 27.8 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2 లక్షల కోట్లు) జీడీపీ నష్టపోవచ్చని చెబుతున్నారు. దేశంలో పెట్టుబడి వ్యయం 8 శాతం నుంచి 27 శాతం మేర పెరుగవచ్చని తెలుస్తున్నది. ఈ ఏడాది దేశంలో 5జీ సేవలు మొదలయ్యే వీలుందని టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ చెబుతున్నది. 2035కల్లా దేశ జీడీపీపై 5జీ సేవల ప్రభావం లక్ష కోట్ల డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నది. ప్రస్తుత 4జీ కంటే ఎన్నో రెట్లు మెరుగైన టెలికం సేవలను వినియోగదారులు 5జీ ద్వారా పొందవచ్చు. ముఖ్యంగా వీడియో కాల్స్‌ నాణ్యత, డౌన్‌లోడింగ్‌ వేగం వంటివి పెరుగుతాయి.


logo