ఆదివారం 29 మార్చి 2020
Business - Jan 29, 2020 , 00:47:36

రూ.200 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం

రూ.200 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం
  • 2022 నాటికి తెలంగాణలో సాధిస్తామన్న జాన్సన్‌ లిఫ్ట్స్‌
  • మార్కెట్‌లోకి సరికొత్త హైస్పీడ్‌ లిఫ్టులను తెచ్చిన సంస్థ

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరికొత్త శ్రేణి హైస్పీడ్‌ లిఫ్ట్‌ మోడల్స్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినట్లు ప్రముఖ లిఫ్ట్స్‌ తయారీ సంస్థ జాన్సన్స్‌ లిఫ్ట్స్‌ అండ్‌ ఎస్కలేటర్స్‌ ప్రకటించింది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో భాగ్యనగరం అగ్రగామిగా ఉందని సంస్థ మార్కెటింగ్‌ దేశీయ విభాగం అధిపతి అల్బర్ట్‌ ధీరవియం అన్నారు. 


బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 4లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో వచ్చిన వృద్ధితో లిఫ్ట్స్‌, ఎస్కలేటర్స్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడిందన్నారు. గతేడాది రూ.2 వేల కోట్ల టర్నోవర్‌ సాధించామని, ఈ ఏడాది రూ.3 వేల కోట్ల టర్నోవర్‌ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 2022 నాటికి రూ.200 కోట్ల టర్నోవర్‌ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా నిర్మాణ రంగంలో పురోగతి సాధిస్తున్న నగరాల్లో హైదరాబాద్‌ ముందుందన్న ఆయన చెన్నై, ఢిల్లీ, పుణె, బెంగళూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయన్నారు. 


ఇక దేశీయ మార్కెట్‌లో తమ సంస్థ 22 శాతం వాటా కలిగి ఉందని చెప్పారు. ఇటీవల రూ.672 కోట్ల అంచనా వ్యయంతో ముంబై, కోల్‌కతా, బెంగళూరు ప్రాంతాల్లో మెట్రో, రైల్వే స్టేషన్లలో 828 ఎస్కలేటర్లు, 365 లిఫ్ట్‌ల ఏర్పాటు కాంట్రాక్టులు తమకు దక్కాయని వివరించారు. కాగా, హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న గచ్చిబౌలి, కోకాపేట తదితర ప్రాంతాల్లో భారీగా నిర్మితమవుతున్న విల్లాలు, భవనాల కోసం హైస్పీడ్‌ లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్‌ మేనేజర్‌ చైతన్య, బిజినెస్‌ హెడ్‌ అలోక్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.


logo