శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 15, 2020 , 00:27:55

ఆర్‌కామ్‌ ఆస్తుల రేసులో జియో

ఆర్‌కామ్‌ ఆస్తుల రేసులో జియో

న్యూఢిల్లీ, జనవరి 14: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) ఆస్తుల కొనుగోలుకు రిలయన్స్‌ జియో పోటీ పడుతున్నది. ఈ రెండు సంస్థలు అంబానీ సోదరులవన్న విషయం తెలిసిందే. ఆర్‌కామ్‌ అనిల్‌ అంబానీకి చెందినదైతే, జియో ముకేశ్‌ అంబానీది. అయితే ఆర్‌కామ్‌ ఆస్తుల కోసం దాఖలైన దాదాపు రూ.25,000 కోట్ల బిడ్లలో రిలయన్స్‌ జియో, యూవీ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ (యూవీఏఆర్‌సీ) కంపెనీలు సమర్పించిన బిడ్లు కూడా ఉన్నాయి. ‘జియో, యూవీఏఆర్‌సీ సంస్థలు.. ఆర్‌కామ్‌ ఆస్తుల కోసం సోమవారం జరిగిన రుణదాతల కమిటీ సమావేశంలో అత్యధిక బిడ్లను దాఖలు చేశాయి’ అని పీటీఐకి సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఆర్‌కామ్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ లిమిటెడ్‌కు చెందిన మొబైల్‌ టవర్‌, ఫైబర్‌ ఆస్తుల కోసం జియో రూ.4,700 కోట్ల బిడ్లను దాఖలు చేసింది. ఇక యూవీఏఆర్‌సీ.. ఆర్‌కామ్‌, రిలయన్స్‌ టెలికం లిమిటెడ్‌ల డేటా సెంటర్‌ వ్యాపారాలు, రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులు, స్పెక్ట్రం కోసం సుమారు రూ.16,000 కోట్ల బిడ్లను సమర్పించింది. ఈ బిడ్డర్లు 90 రోజుల్లోగా సుమారు రూ.7,500 కోట్ల ప్రొసీడ్స్‌లో 30 శాతం చెల్లిస్తామని ముందుకు వచ్చినట్లు రుణదాతలు తెలిపారు. ఆర్‌కామ్‌ రుణ భారం దాదాపు రూ.33,000 కోట్లుండగా, ఈ బిడ్లతో 75 శాతం అప్పులు తీరిపోనున్నాయి. 38 రుణదాతలకు ఆర్‌కామ్‌ బకాయిపడింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆర్‌కామ్‌.. టెలికం సేవలకు ఎప్పుడో గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.


logo