Reliance Jio | కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ టెలికం కంపెనీ ‘జియో ఇన్ఫోకామ్’ రూ.16,640 కోట్ల రుణం తీసుకున్నది. ప్రముఖ గ్లోబల్ బ్యాంక్ హెచ్ఎస్బీసీ బ్యాంకు నుంచి 200 కోట్ల డాలర్ల రుణం తీసుకున్నట్లు ఓ ఆంగ్ల దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విదేశీ బ్యాంకు నుంచి రిలయన్స్ అనుబంధ సంస్థ తీసుకున్న అతిపెద్ద రుణం (offshore loan) ఇది.
నోకియాకు చెందిన 5జీ నెట్వర్క్ గేర్ కొనుగోలు కోసం జియో ఈ రుణం తీసుకుంటున్నట్లు సమాచారం. దీనిపై జియో అధికారికంగా స్పందించలేదు. విదేశాల్లో నిర్వహించే బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను అప్షోర్ లోన్లు అని పిలుస్తారు.
ఈ రుణం విషయమై రిలయన్స్, హెచ్ఎస్బీసీ మధ్య కొన్ని నెలలుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. స్వీడన్ ఎరిక్సన్ 5జీ నెట్ వర్క్ గేర్ కొనుగోలు చేయడానికి బీఎన్బీ పారిబాస్ నుంచి మరో 200 కోట్ల డాలర్ల (రూ.16,640 కోట్లు) రుణం తీసుకున్నది. తొమ్మిది నెలల వ్యవధిలో బీఎన్బీ పారిబాస్ ఈ 1.9-2 బిలియన్ డాలర్ల రుణాన్ని జియోకు విడుదల చేయనున్నది.
ఇటీవల ముగిసిన రిలయన్స్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. డిసెంబర్ నెలాఖరు నాటికి దేశమంతటా 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం 96 శాతానికి పైగా నగరాల్లో జియో 5జీ సేవలు అందిస్తున్నది.