గుండె వేగం గతి తప్పినప్పుడు అదుపులో ఉంచేందుకు పేస్‌మేకర్ అమర్చడం తెలిసిందే. ఆపరేషన్, గుండెపోటు, డ్రగ్స్ అతిగా వాడటం వంటి సందర్భాలలో తాత్కాలికంగా పేస్‌మేకర్‌ను అమర్చాల్సి వస్తుంది. ఇందుకోసం ఛాతీలోకి రంధ్రాలు చేసి గుండెకు చేరేలా తీగను అమరుస్తారు. వాటిని బయట ఉన్న పేస్‌మేకర్ యంత్రానికి అనుసంధానిస్తారు. దీనివల్ల చాలా సమస్యలే వస్తాయి. కొద్దిరోజులపాటు ఆసుపత్రి మంచం మీదినుంచి కదలకుండా ఉండాల్సి వస్తుంది. చికిత్స పూర్తయ్యాక తీగలను తొలగించడమూ కాస్త కష్టమే. వాటివల్ల రక్తం గడ్డ కట్టడం లాంటి ఇబ్బందులూ ఉంటాయి. దీనికి భిన్నంగా ఇప్పుడు శరీరంలో కరిగిపోయే తీగలను రూపొందించారు నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. అంతేకాదు, వీటికి నేరుగా యంత్రాలను జోడించాల్సిన పనికూడా లేదు. ఇవి వైర్లెస్ పద్ధతిలో గుండె లయను నియంత్రించేందుకు కావల్సిన శక్తిని అందిస్తాయి. దీనివల్ల మున్ముందు చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.