శనివారం 06 మార్చి 2021
Business - Feb 03, 2021 , 08:18:15

అమెజాన్‌ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్న జెఫ్‌ బెజోస్‌

అమెజాన్‌ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్న జెఫ్‌ బెజోస్‌

వాషింగ్టన్‌ : ఆన్‌లైన్‌ మార్కెటింగ్ కంపెనీ, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రపంచ కుబేరుడిగా పేరున్న జెఫ్‌ బెజోస్‌ సంచలన ప్రకటన చేశారు. అమెజాన్‌ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా అమెజాన్‌లో అన్ని రకాల బాధ్యతల నుంచి వైదొలగబోతున్న ఆయన తన వారసుడిని సైతం ఖరారు చేశారు. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ హెడ్‌ ఆండీ జాక్సీని సీఈఓగా నియమించనున్నట్లు ప్రకటించారు. 27 ఏళ్ల కిందట ఇంటర్నెట్‌లో పుస్తకాలు అమ్మేందుకు అమెజాన్‌ను ప్రారంభించిన బెజోస్‌.. అంచెలంచెలుగా ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఎదిగారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు లేఖ రాశారు.

అమెజాన్‌ అంటే ఆవిష్కరణ అని పేర్కొన్న బెజోస్‌.. ఇప్పటి వరకు సంస్థను కనిపెట్టుకుంటూ వచ్చానని, ఇక పదవి నుంచి మారడం ఇదే సరైన సమయమన్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికం వరకు పదవి నుంచి తప్పుకొని ఆండీ జెస్సీకి బాధ్యతలు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అమెజాన్ ముఖ్యమైన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటానని పేర్కొన్నారు. డే వన్ ఫండ్,  బెజోస్ ఎర్త్ ఫండ్, అంతరిక్ష పరిశోధన, జర్నలిజంలో ఇతర వ్యాపార సంస్థలు, దాతృత్వ కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. 57 ఏళ్ల బెజోస్ 1994లో అమెజాన్‌ను స్థాపించాడు. స్ట్రీమింగ్ మ్యూజిక్.. టెలివిజన్, కిరాణా, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆన్‌లైన్ రిటైల్‌పై ఆధిపత్యం చెలాయించారు.

ఇంకా ఆయన ది వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రికతో పాటు ప్రైవేట్ అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ సంస్థలను సైతం నిర్వహిస్తున్నారు. అయితే, కాబోయే సీఈఓ జెస్సీ 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరాడు. ప్రస్తుతం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ హెడ్‌గా కొనసాగుతున్నాడు. జెస్సీ అత్యుత్తమ నాయకుడిగా ఉంటాడని, నాకు పూర్తి విశ్వాసం ఉందని జెఫ్‌ బోజెస్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అమెజాన్‌ మార్కెట్‌ విలువ మంగళవారం నాటికి 1.69 ట్రిలియన్లు. సంస్థకు అమెరికాలో ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్‌కుపైగా ఉన్నారు.

VIDEOS

logo