గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 01, 2021 , 17:10:34

పొగాకు ఉత్పత్తి కంపెనీల షేర్ల దూకుడు.. ఎందుకంటే?

పొగాకు ఉత్పత్తి కంపెనీల షేర్ల దూకుడు.. ఎందుకంటే?

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం పొగాకు ఉత్పత్తి కంపెనీల షేర్లు ఒక్కసారిగా ఎగబాకాయి. దేశంలో సిగరెట్స్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసే ఐటీసీ షేరు సోమవారం 6.5 శాతం మేర పెరిగింది. గోల్డెన్ టొబాకో షేరు 7.94, వీఎస్‌టీ ఇండస్ట్రీస్ షేరు 2.06, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేరు 0.83 శాతం మేర పెరిగాయి. కేంద్ర బడ్జెట్‌లో పొగాకు ఉత్పత్తులపై పన్నులు ఎంత పెరిగాయి అన్నదానిపై స్పష్టత లేకపోవడమే దీనికి కారణం. 

బడ్జెట్ 2021లో పొగాకు ఉత్పత్తులపై విధించే గరిష్ఠ పన్నుగురించి ప్రస్తావించలేదు. దీంతో ఈసారి బడ్జెట్‌లో సిగరెట్స్‌ వంటి పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంచలేదని తెలుస్తున్నది. అలాగే వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్‌ను మద్యంపై మాత్రమే విధించారు. ఈ బడ్జెట్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పన్నును కూడా పొగాకు ఉత్పత్తులపై విధించలేదు. 

గత ఏడాది బడ్జెట్‌లో పొగాకు ఉత్పత్తులపై పన్నును గరిష్ఠంగా పెంచినందుకు ఈసారి కేంద్ర ప్రభుత్వం దాని జోలికి పోలేదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం బలహీనంగా ఉన్న పొగాకు ఉత్పత్తి కంపెనీల షేర్‌ ధరలు బడ్జెట్‌ ప్రవేశం అనంతరం ఎగబాకాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo