బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jul 26, 2020 , 00:18:12

డిమాండ్‌కు దెబ్బ

డిమాండ్‌కు దెబ్బ

  • బంగారం ధరలు ఇలాగే పెరుగుతూపోతే కష్టమే 
  • ఆందోళనలో నగల వర్తకులు

ముంబై, జూలై 25: ఓవైపు ఆర్థిక మందగమనం.. మరోవైపు రోజురోజుకూ పెరుగుతూపోతున్న బంగారం ధరలు.. నగల వర్తకులకు వ్యాపారాన్ని దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న ధరలతో అమ్మకాలు పడిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశీయ మార్కెట్‌లో మునుపెన్నడూ లేనివిధంగా పుత్తడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం రికార్డు స్థాయిల్లో కదలాడుతున్నాయి. శుక్రవారం ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.51,946 పలికింది. ముంబైలో రూ.50,919గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మదుపరులు బంగారాన్ని తమ పెట్టుబడులకు సురక్షిత మార్గంగా ఎంచుకుంటుండటంతో బహిరంగ విపణిలో ధరలు ఎగిసిపడుతున్నాయి. 

దీనికితోడు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కనిష్ఠ స్థాయిలకు దిగజారుతుండటం కూడా ధరలకు రెక్కల్ని తొడుగుతున్నది. గ్లోబల్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర తొమ్మిదేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 1,900 డాలర్లకు చేరింది. ధరలు నిలకడగా ఉంటేనే వ్యాపారాలు వృద్ధిపథంలో సాగుతాయని వర్తకులు చెప్తున్నారు. అధిక ధరలతో కస్టమర్లు తమ కొనుగోళ్లను చాలావరకు తగ్గించుకుంటున్నారన్నారు. లాక్‌డౌన్‌తో చాలారోజులు వ్యాపారాలు మూతబడ్డాయని, తెరుచుకున్నాక ధరల పెరుగుదలతో గిరాకీ సన్నగిల్లిందని వాపోతున్నారు. అయితే ధరలు నిలకడను సంతరించుకుంటే డిమాండ్‌ మళ్లీ పెరిగి కొనుగోళ్లు ఊపందుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

నవంబర్‌దాకా పరుగులే

బంగారం ధరలు తగ్గుతాయేమోనని చాలామంది ఎదురు చూస్తున్నారని, అయితే ఈ ఏడాది నవంబర్‌దాకా పెరుగుదలే ఉంటుందని ప్రపంచ స్వర్ణ మండలి ఇండియా విభాగం ఎండీ సోమసుందరం పీఆర్‌ అన్నారు. గతేడాది జనవరి నుంచి పసిడి ధరలు 60 శాతానికిపైగా పెరిగాయని, ఆగస్టు నుంచి ధరల పరుగు మొదలైందని చెప్పారు. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి ధర చేరిందని పేర్కొన్నారు. పెండ్లిండ్లు ఆగిపోవడంతో వివాహ బంగారం కొనుగోళ్లూ భారీగా పడిపోయాయని అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి చైర్మన్‌ అనంత పద్మనాభన్‌ తెలిపారు.

రూ.65వేలను చేరొచ్చు

బహిరంగ మార్కెట్‌లో బంగారం కొనుగోళ్లు తక్కువగా ఉన్నా.. పసిడిపై పెట్టుబడులు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయని పీఎన్‌ గాడ్గిల్‌ ఎండీ, సీఈవో సౌరభ్‌ గాడ్గిల్‌ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ కుదిపేస్తుండటంతో స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయని, దీంతో పెట్టుబడుల రక్షణార్థం మదుపరులు పుత్తడిపై దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే మరో ఏడాది కాలంలో 10 గ్రాముల బంగారం ధర రూ.65వేలను చేరుతుందని గాడ్గిల్‌ అంచనా వేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు 2,500 డాలర్లు పలుకుతుందన్నారు.


‘ధరల్లో స్వల్ప ఒడిదుడుకులు ఉండొచ్చు. అంతేగానీ పెద్ద మార్పులుండవ్‌. ఇక తులం ధర రూ.50వేల స్థా యిలోనే కదలాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు మదుపరుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. మరోవైపు కొనుగోలుదారులూ జాగ్రత్త పడుతున్నారు’

-సోమసుందరం పీఆర్‌, ప్రపంచ స్వర్ణ మండలి దేశీయ విభాగం ఎండీ

‘ఇప్పటికే బంగారానికి డిమాం డ్‌ భారీగా తగ్గిపోయింది. ఆర్థిక మందగమన పరిస్థితుల తో సాధారణ అ మ్మకాల్లో 20-25 శాతమే జరుగుతున్నాయి. ఈ సమయంలో కరోనా కారణంగా లాక్‌డౌన్లు, భౌతిక దూరం, ఉద్యోగాలు ప్రమాదంలో పడటంతో విక్రయాలు మరింతగా దిగజారాయి’ 

-అనంత పద్మనాభన్‌, అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి చైర్మన్‌


logo