మంగళవారం 02 మార్చి 2021
Business - Feb 16, 2021 , 03:07:26

ఐటీ ఆదాయం 2.3% వృద్ధి

ఐటీ ఆదాయం 2.3% వృద్ధి

  • రూ.10,89,381 కోట్ల ఎగుమతులు
  • పరిశ్రమ పనితీరుపై నాస్కామ్‌ 

మార్చి 31తో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ పరిశ్రమ ఇప్పటివరకు 1.38 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకున్నదని, దీంతో ఈ రంగంలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 44.7 లక్షలకు పెరిగిందని నాస్కామ్‌ వెల్లడించింది. 

ముంబై, ఫిబ్రవరి 15: కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా వ్యయం తగ్గినప్పటికీ భారత ఐటీ రంగం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదని నాస్కామ్‌ (నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశీయ ఐటీ రంగం రాబడులు 2.3 శాతం వృద్ధితో 194 బిలియన్‌ డాలర్ల (రూ.14,08,772 కోట్ల)కు పెరగవచ్చని అంచనా వేసింది. ఇదే సమయంలో దేశ ఐటీ ఎగుమతులు 1.9 శాతం వృద్ధి చెంది 150 బిలియన్‌ డాలర్ల (రూ.10,89,381 కోట్ల)కు చేరవచ్చని తెలిపింది. 

మార్చి 31తో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ పరిశ్రమ ఇప్పటివరకు 1.38 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకున్నదని, దీంతో ఈ రంగంలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 44.7 లక్షలకు పెరిగిందని నాస్కామ్‌ వెల్లడించింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఐటీ పరిశ్రమ రాబడుల వృద్ధి రేటు హయ్యర్‌ సింగిల్‌ డిజిట్లలో లేదా డబుల్‌ డిజిట్లలో నమోదవుతున్నదని, ప్రపంచంలో ఐటీ సేవలకు డిమాండ్‌ పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సర ఆరంభం నుంచి కరోనా వైరస్‌ విజృంభించడం, ఆ మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్ల వల్ల ఐటీ ఉత్పత్తుల డెలివరీలపై ఆందోళనలు నెలకొనడంతో టెక్నాలజీపై వ్యయం భారీగా తగ్గిందని, ఫలితంగా దేశ ఐటీ పరిశ్రమ ఆదాయ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని వివరించింది. 

కోవిడ్‌-19 నుంచి త్వరగా కోలుకున్నాం..

అయితే లాక్‌డౌన్‌ సమయంలో ఐటీ కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) చేయడంతో సకాలంలో డెలివరీలు జరిగాయని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవ్‌జానీ ఘోష్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మన ఐటీ ఎగుమతులు 1.9 శాతం వృద్ధి చెంది 150 బిలియన్‌ డాలర్లకు, దేశీయ రాబడులు 3.4 శాతం వృద్ధితో 45 బిలియన్‌ డాలర్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’ అని నాస్కామ్‌ పేర్కొన్నది. అలాగే ఐటీ సేవల రంగం 2.7 శాతం వృద్ధితో 99 బిలియన్‌ డాలర్లకు, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం) రంగం 2.3 శాతం వృద్ధితో 38 బిలియన్‌ డాలర్లకు, సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల రంగం 2.7 శాతం వృద్ధితో 9 బిలియన్‌ డాలర్లకు, హార్డ్‌వేర్‌ రంగం 4.1 శాతం వృద్ధితో 16 బిలియన్‌ డాలర్లకు, ఈ-కామర్స్‌ రంగం 4.8 శాతం వృద్ధితో 57 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని వివరించింది. 

VIDEOS

logo