శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 06, 2020 , 00:15:34

బాల్యం నుంచే పొదుపు

బాల్యం నుంచే పొదుపు

ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం.. అన్నారో  సినీ కవి. ఇది నిజంగా అక్షర సత్యం. అందుకే పిల్లలకు చిన్నతనం నుంచే డబ్బు విలువ చెప్తూ పెంచాలి.

పసి వయసు నుంచే పెద్దలు వారికి నేర్పే పొదుపు పాఠాలు.. జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతాయి. ఆదాయ-వ్యయాల మధ్యనున్న అంతరాలను వివరిస్తేనే బతుకు బండి సజావుగా నడుస్తుంది.

ఆర్థిక క్రమశిక్షణ అన్నది నేడు ప్రతీ ఒక్కరికీ తప్పక ఉండాల్సిన లక్షణం. దాన్ని తల్లిదండ్రులే పిల్లలకు అలవర్చాలి. బడిలో నేర్చుకున్న చదువు.. ఒడిలో నేర్చుకున్న పొదుపు మీ చిన్నారి భవిష్యత్తును బంగారుమయం చేస్తాయి.

పిల్లలకు ముందుగా మన అవసరాలేమిటో చెప్పాలి. దీనివల్ల అనవసరపు ఖర్చులేమిటన్నదానిపై వారికో స్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ముఖ్యమని వివరించాలి. డబ్బు విలువను వివరిస్తూ పెంచడం వల్ల జీవితం అంటే ఏమిటో కూడా తెలుస్తుంది. అప్పుడే తల్లిదండ్రుల కష్టాన్నీ వారు గౌరవిస్తారు.

పొదుపును ప్రోత్సహించండి

చిన్ననాటి నుంచే పొదుపును ప్రోత్సహించాలి. అందుకు తగ్గ అవకాశాలనూ పిల్లలకు పెద్దలే కల్పించాలి. కిడ్డీ బ్యాంక్‌ వంటి వాటిని బహుమతిగా అందించండి. మంచి పని చేసినప్పుడో, చదువులో మార్కులు ఎక్కువగా వచ్చినప్పుడో డబ్బు చేతికిచ్చి అందులో వేయించండి. ఇది వారి వ్యక్తిత్వ వికాసానికీ దోహదపడుతుంది. చదువులోనూ రాణించగలుగుతారు.

లక్ష్యాలను నిర్దేశించండి

పిల్లలు అడిగిందల్లా వెంటనే కొనివ్వడం మంచిది కాదు. ఏదైనా కోరుకున్న వెంటనే దక్కితే దాని విలువ వారికి తెలియదు. కాబట్టి కావాలనుకున్నది అందుకోవాలంటే పొదుపు చేయాలని చెప్పాలి. దీనివల్ల దేన్నైనా సొంతంగా సాధించుకోవడం అలవడుతుంది. 

తప్పు-ఒప్పులను విశ్లేషించండి

పిల్లలు చెప్తే విని నేర్చుకునే దానికన్నా.. చేస్తే చూసి నేర్చుకునేదే ఎక్కువ. కాబట్టి మన ప్రవర్తన బాగుండటం ఎంతో ముఖ్యం. డబ్బు విషయంలో బంధించినట్లుండే వైఖరి కూడా చాలా ప్రమాదం. కాబట్టి మీ పర్యవేక్షణలో వారికి కావాల్సినంత స్వేచ్ఛనివ్వండి. దీనివల్ల చేతిలో ఉన్న సొమ్మును వారు దేనికి వినియోగించడానికి చూస్తున్నారన్నది తెలుస్తుంది. అంతేగాక దుర్వినియోగం చేస్తున్నారనుకుంటే వెంటనే ఆ తప్పును సరిదిద్దే అవకాశం మనకు లభిస్తుంది.

బ్యాంక్‌ ఖాతాలను తెరువండి

పిల్లల కోసం బ్యాంక్‌లో ఖాతాలను తెరువడం కూడా ప్రయోజనకరమే. దీనివల్ల సేవింగ్స్‌పై వారికి శ్రద్ధ పెరుగుతుంది. బ్యాంకింగ్‌ లావాదేవీలపైనా చిన్నతనం నుంచే మంచి అవగాహన ఏర్పడుతుంది. అలాగే పిల్లల పొదుపును ప్రోత్సహించేలా పెద్దలూ అండగా ఉంటే మరిన్ని సత్ఫలితాలను అందుకోవచ్చు. అత్యవసరాల్లో డబ్బు ఎంతగా ఉపయోగపడుతుందో చెప్పడం వల్ల పిల్లలను అనవసరపు ఖర్చుల నుంచీ తప్పించగలుగుతాం.

అప్పు విలువనూ తెలియజేయండి

రుణాలను సద్వినియోగం చేసుకుంటే ఎన్ని లాభాలుంటాయో.. దుర్వినియోగం చేస్తే అన్ని నష్టాలుంటాయని పిల్లలకు ముందు నుంచే చెప్పడం చాలాచాలా అవసరం. అప్పులకు పూర్తిగా దూరంగా ఉన్నా లేక వాటికి పదేపదే అలవాటు పడినా ప్రమాదమని గుర్తుచేయాలి. పొదుపు ప్రాధాన్యతను చెప్తూనే అప్పు విలువను తెలియజేయడం సర్వదా శ్రేయస్కరం.

14 నుంచి భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌

ప్రభుత్వ రంగ సంస్థల్లో నేరుగా పెట్టుబడులు పెట్టే ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లు మళ్లీ జారీ కాబోతున్నాయి. ఈ నెల 14 నుంచి 17 వరకు అందుబాటులో ఉండనున్న ఈ బాండ్లలో ఎవరైనా పెట్టుబడులు పెట్టవచ్చు. రెండు రకాల్లో లభించనున్న ఈ బాండ్లు ఒకటి ఐదేండ్ల కాలపరిమితితో, మరొకటి 11 ఏండ్ల కాలపరిమితితో రానున్నాయి. ఈటీఎఫ్‌ బాండ్ల జారీ ద్వారా సేకరించిన నిధులను ఏఏఏ రేటింగ్‌ కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టనున్నారు. ఈ రెండు ఈటీఎఫ్‌లపై 6.84 శాతం, 8.6 శాతం రిటర్నులు అందుకోవచ్చు.


logo