ఆదివారం 12 జూలై 2020
Business - Jun 03, 2020 , 23:56:40

ఐటీ పొదుపు మంత్రం

ఐటీ పొదుపు మంత్రం

ముంబై, జూన్‌ 3: కరోనా సంక్షోభం వల్ల ఈ ఏడాది భారత ఐటీ రంగంలో వ్యయాలు 8 శాతం తగ్గి 83.5 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.6.30 లక్షల కోట్లకు) పడిపోవచ్చని మార్కెట్‌ రిసెర్చ్‌ సంస్థ ‘గార్ట్‌నర్‌' బుధవారం స్పష్టం చేసింది. భారత ఐటీ రంగంలో వార్షిక వ్యయాలు తగ్గనుండటం గత ఐదేండ్లలో ఇదే తొలిసారని పేర్కొన్నది. ఈ ఏడాది భారత ఐటీ రంగంలో వ్యయాలు 6.6 శాతం పెరిగి 94 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.7.08 లక్షల కోట్లకు) చేరుతాయని గతేడాది నవంబర్‌లో అంచనా వేసిన గార్ట్‌నర్‌.. ఇప్పుడు కొవిడ్‌-19 సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని పాత అంచనాలను సవరించింది. ప్రస్తుతం భారత్‌లోని ఐటీ సంస్థల చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్లు (సీఎఫ్‌వోలు) చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్లు (సీఐవోలు) కలిసి తమ కంపెనీల బడ్జెట్‌ ప్రాధాన్యాలను మారుస్తున్నారని, కొవిడ్‌-19 సంక్షోభాన్ని, ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారు తమ బడ్జెట్‌ వ్యయాల విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారని గార్ట్‌నర్‌ సీనియర్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ నవీన్‌ మిశ్రా తెలిపారు.logo