శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Jan 23, 2020 , 00:24:53

7 లక్షలదాకా 5 శాతమే!

7 లక్షలదాకా 5 శాతమే!
  • రాబోయే బడ్జెట్‌లో ఐటీ శ్లాబుల సవరణ?
  • రూ.7 లక్షలు-10 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను 10 శాతమే
  • మధ్యతరగతి, వేతన జీవులకు గొప్ప ఊరట

న్యూఢిల్లీ, జనవరి 22: రాబోయే కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతి, వేతన జీవులకు గొప్ప ఊరట దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ఆదాయంపై పన్ను శ్లాబుల మార్పులుండవచ్చని తెలుస్తున్నది. రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికీ 5 శాతం పన్నునే ప్రతిపాదించే వీలుందని సమాచారం. ప్రస్తుతం రూ.2.5 లక్షలదాకా వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్నులు లేవన్న విషయం తెలిసిందే. రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి 5 శాతం పన్ను విధిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం రిబేటు ఇస్తున్నది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటకపోతేనే ఇది వర్తిస్తుంది. ఈ క్రమంలో 5 శాతం శ్లాబును రూ.7 లక్షలకు పొడిగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. కాగా, రిబేటు కూడా రూ.7 లక్షల వరకు ఉంటుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది విదితమే. 


సగానికి కోత

అలాగే రూ.7 లక్షల నుంచి 10 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి 10 శాతం పన్నునే వేయాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఇప్పుడు రూ.5 లక్షల నుంచి 10 లక్షలదాకా వార్షిక ఆదాయం ఉన్నవారిపై 20 శాతం పన్ను పడుతున్నది. ఆపై ఆదాయం ఉంటే 30 శాతం. ఈ క్రమంలో రూ.5 లక్షలు-10 లక్షల శ్లాబును సగానికి విభజించి రూ.7 లక్షల వరకు 5 శాతం, అక్కడి నుంచి రూ.10 లక్షలదాకా 10 శాతం పన్నును ప్రతిపాదించనున్నారని తెలుస్తున్నది. అలాగే రూ.10 లక్షల నుంచి 20 లక్షల వరకు వార్షిక ఆదాయముంటే 20 శాతం పన్నుకు వీలున్నది. రూ.20 లక్షల నుంచి 10 కోట్ల మధ్య 30 శాతం పన్నును ప్రతిపాదించే అవకాశాలున్నాయి. 


35 శాతం శ్లాబు

రూ.10 కోట్లకు మించి వార్షిక ఆదాయమున్నవారికి కొత్తగా 35 శాతం శ్లాబును పరిచయం చేయవచ్చని తెలుస్తున్నది. ఈ మార్పులన్నీ కూడా 60 ఏండ్ల దిగువన ఉన్న వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులకేనని సమాచారం. 60-80 ఏండ్ల వయసున్న సీనియర్‌ సిటిజన్లకు, 80 ఏండ్లపైనున్న వారికి ఐటీ శ్లాబులు, పన్నులు వేర్వేరుగా ఉంటాయన్న సంగతి విదితమే. గతేడాది ఫిబ్రవరిలో ప్రకటించిన మధ్యంతర బడ్జెట్‌లో రూ.5 లక్షల వరకు వార్షిక ఆదా యం ఉంటే పన్ను మినహాయింపునిచ్చినది తెలిసిందే. కాగా, దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం, మార్కెట్‌లో చోటుచేసుకున్న స్తబ్ధతల మధ్య వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఐటీ శ్లాబుల సవరణ, పన్ను కోతలు దోహదపడుతాయని కేంద్రం విశ్వసిస్తున్నది. ఇప్పటికే కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించి జీడీపీకి జోష్‌నిచ్చే ప్రయత్నాన్ని కేంద్రం చేసినది విదితమే.


బడ్జెట్‌ రోజున స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుండగా, ఆ రోజున స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌ జరుగనున్నది. ఫిబ్రవరి 1 శనివారం అవుతున్నది. సాధారణంగా శని, ఆదివారాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లకు సెలవన్న విషయం తెలిసిందే. అయితే శనివారమైనప్పటికీ బడ్జెట్‌ ప్రకటన ఉన్నందున మార్కెట్లు తెరిచే ఉంటాయని బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌నూ విడుదల చేసింది. ఎప్పట్లాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ట్రేడింగ్‌ ఉంటుందని వివరించింది. బడ్జెట్‌లో మార్కెట్‌ ఆధారిత ప్రకటనలు ఉంటాయి కాబట్టి ట్రేడింగ్‌ జరుపాలన్న విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయానికి స్టాక్‌ ఎక్సేంజ్‌లు వచ్చినట్లు తెలుస్తున్నది. 2015లోనూ బడ్జెట్‌ ప్రకటన శనివారం (ఫిబ్రవరి 28) వచ్చింది. అప్పుడు కూడా స్టాక్‌ మార్కెట్లు ట్రేడ్‌ అయ్యాయి. నాడు అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2001లో బడ్జెట్‌ ప్రకటన సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా ప్రతీ బడ్జెట్‌ రోజున స్టాక్‌ మార్కెట్లు ట్రేడ్‌ అవుతూనే ఉన్నాయి. గడిచిన ఈ దాదాపు 20 ఏండ్లలో ఒక్కసారే శనివారం బడ్జెట్‌ను ప్రకటించగా, ఇప్పుడు మరోసారి శనివారమే అయ్యింది.


logo