శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Business - Jan 20, 2020 , 01:18:13

మళ్లీ మధ్యంతర డివిడెండ్‌?

మళ్లీ మధ్యంతర డివిడెండ్‌?
  • వచ్చే ఆర్బీఐ బోర్డు సమావేశంలో చర్చ

న్యూఢిల్లీ, జనవరి 19: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తదుపరి బోర్డు సమావేశంలో మధ్యంతర డివిడెండ్‌పై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న స్తబ్ధత.. కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు లక్ష్యాలను దెబ్బతీస్తుండటంతో ఖజానాకు ఆర్బీఐ సాయం అవసరమవుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) జీడీపీలో ద్రవ్యలోటును 3.3 శాతానికి పరిమితం చేస్తామని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక మందగమన పరిస్థితుల మధ్య ప్రభుత్వ ఆదాయం పడిపోయి ఖర్చులు పెరిగిపోతున్నాయి. జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో వృద్ధిరేటు ఆరేండ్లకుపైగా కనిష్ఠాన్ని తాకుతూ 4.5 శాతానికి పరిమితమైన సంగతీ విదితమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా దేశ జీడీపీ 11 ఏండ్ల కనిష్ఠానికి దిగజారి 5 శాతంగానే నమోదు కావచ్చని ప్రభుత్వ అంచనాలే చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రతరమవుతుండగా, సర్కారు చూపు ఆర్బీఐ సొమ్ముపై పడుతున్నది.

ఈ మార్చి ఆఖర్లోగా బోర్డు సమావేశం జరుగనుండటంతో బోర్డులోని ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు.. మధ్యంతర డివిడెండ్‌ను బలంగా ప్రస్తావనకు తెచ్చే వీలుందని సంబంధిత వర్గాల సమాచారం. కాగా, జూలై-జూన్‌ కాలాన్ని ఆర్బీఐ ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. దీంతో మధ్యంతర డివిడెండ్‌కు ఆమోదం లభిస్తే గడిచిన ఆరు నెలల ఆధారంగానే ప్రభుత్వానికి నిధులు లభిస్తాయి. అయినప్పటికీ ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో కేంద్రానికి ఉపశమనమేనని అంటున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2018-19) కేంద్రానికి రూ.28 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఆర్బీఐ అందించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2017-18)లో ప్రభుత్వం రూ.10 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను పొందింది. ఇక నిరుడు ఆగస్టులో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని సెంట్రల్‌ బోర్డు రూ.1,76,051 కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపినది విదితమే. ఇందులో 2018-19 మిగులు రూ.1,23,414 కోట్లు కూడా ఉన్నాయి. మిగతా రూ.52,637 కోట్లు ఎకనామిక్‌ క్యాపిటల్‌ ఫ్రేంవర్క్‌ (ఈసీఎఫ్‌) సవరణలతో గుర్తించిన మిగులు. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ అంచనా (రూ.90 వేల కోట్లు) కంటే ఎక్కువగానే ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి డివిడెండ్‌ వచ్చింది. రూ.95,414 కోట్లు అందాయి.


logo