శనివారం 06 మార్చి 2021
Business - Feb 09, 2021 , 02:02:04

తిరుగులేని ఐఎస్‌బీ

తిరుగులేని ఐఎస్‌బీ

  • దేశంలోని బిజినెస్‌ స్కూల్స్‌లో టాప్‌
  • ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8: విద్యా రంగంలో తెలంగాణ కీర్తి పతాకం మరోసారి సగర్వంగా రెపరెపలాడింది. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఐఎస్‌బీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌).. దేశంలోని టాప్‌ బిజినెస్‌ స్కూల్స్‌లో అగ్రగామిగా నిలిచింది. అంతేకాకుండా ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌' పత్రిక రూపొందించిన ప్రపంచ ఎంబీఏ ర్యాంకింగ్స్‌-2021లో 23వ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఐఎస్‌బీ ఆఫర్‌ చేస్తున్న పీజీపీ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సుకు ఈ ర్యాంకు లభించింది. ఈ జాబితాలోని ప్రపంచ టాప్‌-25 విద్యా సంస్థల్లో భారత్‌ నుంచి కేవలం ఐఎస్‌బీకి మాత్రమే చోటు లభించడం గమనార్హం. పీజీపీ-2017 తరగతికి చెందిన పూర్వ విద్యార్థులపై సర్వే నిర్వహించి ప్రపంచంలో ఐఎస్‌బీకి 23వ ర్యాంకు ఇచ్చినట్లు ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌' సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌-బెంగళూరు (ఐఐఎం-బెంగళూరు) 35వ స్థానంలో నిలిచింది. ఐఐఎం-కోల్‌కతా 44వ ర్యాంకును, ఐఐఎం-అహ్మదాబాద్‌ 48వ ర్యాంకును, ఐఐఎం-ఇండోర్‌ 94వ ర్యాంకును దక్కించుకున్నాయి.

అవిశ్రాంత కృషికి గుర్తింపు..

ప్రపంచ శ్రేణి పరిశోధనలకు పెద్దపీట వేయడంతోపాటు మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాల్లో చేరేలా మహిళలను ప్రోత్సహించేందుకు తమ విద్యా సంస్థ అవిశ్రాంతంగా చేస్తున్న కృషికి గుర్తింపుగానే ఈ ర్యాంకు లభించిందని ఐఎస్‌బీ డీన్‌ రాజేంద్ర శ్రీవాస్తవ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐఎస్‌బీ విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ విద్యను అందించేందుకు సొంతగా రూపొందించుకున్న కోర్సులతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంతోపాటు దేశ నిర్మాణంలో వారు కీలకపాత్ర పోషించేలా చూసేందుకు మున్ముందు కూడా ఐఎస్‌బీ ఇదే విధమైన కృషిని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

VIDEOS

logo