ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఏ వ్యక్తయినా, ఎవరికైనా ఎంత నగదునైనా బహుమతిగా ఇవ్వొచ్చు. కానీ ఆ బహుమతి తీసుకునే వ్యక్తి మాత్రం ఒక పరిమితికి మించితే పన్ను చెల్లించాల్సివుంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో బహుమతులుగా నగదు రూపంలో రూ.50,000లోపు స్వీకరిస్తే, ఆ మొత్తానికి పూర్తి పన్ను మినహాయింపు ఉంది. అంతకు మించి స్వీకరిస్తే… ఆ వ్యక్తి శ్లాబ్ పరిధిలో పన్ను కట్టాలి. నగదు బహుమతి రూ.2 లక్షలు లేదా అంతకుమించితే, ఆ మొత్తానికి సమానంగా పన్నుకు తోడు పెనాల్టీ పడుతుంది. ఇక చట్టంలో నిర్దేశించిన‘స్పెసిఫైడ్ రిలేటివ్స్’ తండ్రి..కొడుక్కి ఇచ్చే బహుమతిపై పన్ను ఉంటుందా?బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడ ంలో పన్ను మినహాయింపులున్నాయి. ఒక తండ్రి తన కుమారుడికి ఎంతమొత్తమైనా బహుమతిగా ఇవ్వొచ్చు. ఇందుకు ఇరువురిలో ఎవరిపైనా పన్ను భారం ఉండదు. భార్యాభర్తలు, తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి బంధుత్వాల్ని ‘స్పెసిఫైడ్ రిలేటివ్స్’గా చట్టం నిర్వచించింది.
పన్ను మినహాయింపులు
కొన్ని రకాల ఖర్చులు, ఆదాయం లేదా పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఉదాహరణకు హెచ్ఆర్ఏ, ఎల్‌టీఏ, గ్రాట్యుటీ, వీఆర్ఎస్, పెన్షన్ వంటి వి. కంపెనీ ఇచ్చే వసతి, లాప్టాప్, మొబైల్ ఫోన్స్ కొనుగోలు కోసం ఇచ్చే అలవెన్సులకూ ఈ ప్రయోజనం దక్కుతుంది. అయితే ట్యాక్స్ ఫైలింగ్ చేసే ముందు పనిచేస్తున్న కంపెనీకి ఈ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. మీరిచ్చే ట్యాక్స్ సేవిం గ్స్ స్టేట్మెంట్ చూసి మదింపు చేసి వేతనం నుంచి టీడీఎస్ మినహాయించుకుంటారు.
పన్ను కోతలు
పన్ను చెల్లింపుదారుని మొత్తం ఆదాయం నుంచి తగ్గించే అంశాలివి. వీటిని తగ్గించి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని గణిస్తారు. ట్యూషన్ ఫీజు, మెడికల్ వ్యయాలు, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జీలు వీటి పరిధిలోకి వస్తాయి. వీటిని ఐటీ చట్టం సెక్షన్లు 80సీ, 80డీ, 80ఈ, 80జీ ప్రకారం ఆదాయంలో తగ్గించి పన్నును గణిస్తారు.
ట్యాక్స్ రిబేట్
తక్కువ ఆదాయం ఉంటే పన్ను భారం తగ్గించడానికి ట్యాక్స్ రిబేట్ ఉపయోగపడుతుంది. ఏటా రూ.5 లక్షలలోపు ఆదాయమున్న వ్యక్తులకు వర్తిస్తుంది. గరిష్టంగా రూ.2,500 వరకు రిబేట్‌ను పొందవచ్చు.
ట్యాక్స్ రిఫండ్
ఆదాయపు పన్ను శాఖకు చెల్లించిన పన్ను తిరిగి ఇవ్వాలని చేసే క్లెయిమ్ ఇది. పన్ను మదింపు చేసినప్పటి చెల్లింపు, పన్ను దాఖలు చేసే సమయానికి వచ్చే చెల్లింపులకు మధ్య వ్యత్యాసమే ఈ క్లెయిమ్. అధికంగా టీడీఎస్ లేదా మరో రూపంలో ఎక్కువగా పన్ను చెల్లించి ఉంటే ట్యాక్స్ రిఫండ్‌ను కోరవచ్చు.