e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home బిజినెస్ పరుగెందాకా!

పరుగెందాకా!

పరుగెందాకా!

సూచీలు ఏ రోజుకారోజు కొత్త రికార్డులు నెలకొల్పిన ఈ జూన్‌ తొలివారం ఐదు ట్రేడింగ్‌ రోజుల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీ) దేశీ స్టాక్‌ మార్కెట్లోకి రూ. 9,500 కోట్లకుపైగా నిధులు కుమ్మరించారు. కరోనా సెకండ్‌వేవ్‌ మొదలైన ఏప్రిల్‌ నెలలోనూ, పలు రాష్ర్టాలు లాక్‌డౌన్‌లు అమలుజరిపిన మే నెలలోనూ వీరు నిధులు వెనక్కుతీసుకోకపోగా, ఈ రెండు నెలల్లో రూ. 12,000 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టడం విశేషం. ఇక ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఎఫ్‌పీఐల ఈక్విటీ పెట్టుబడులు రూ. 55,741 కోట్లు. 2020 అక్టోబర్‌ నుంచి 2021 మార్చి వరకూ దేశంలోకి తరలివచ్చిన విదేశీ పోర్ట్‌ఫోలియో నిధులు రూ.1.97 లక్షల కోట్లు. ఈ తరహాలో నిధులు ప్రవహిస్తూవుంటే, షేర్లే కాదు, ఏ ఆస్తి ధరలైనా ఎందుకు పెరక్కుండా వుంటాయి?

జీరో వడ్డీ రేట్ల ప్రభావం

అమెరికాలో జీరో వడ్డీ రేట్లు, యూరప్‌, జపాన్‌లలో మైనస్‌ వడ్డీ రేట్లతో పాటు ఆయా కేంద్ర బ్యాంకులు బాండ్ల కొనుగోళ్ల ద్వారా వ్యవస్థలోకి పుష్కలంగా లిక్విడిటీని ప్రవహింపచేస్తున్నాయి. ఫలితంగా అమెరికా, యూరప్‌,రష్యా, ఆస్ట్రేలియా దేశాల సూచీలు కూడా కొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్నాయి. మన దేశంలానే, కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బ్రెజిల్‌ ఈక్విటీలు సైతం ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయిలో ట్రేడవుతున్నాయి. ప్రపంచంలో 50 ప్రధాన మార్కెట్లను ప్రతిబింబించే ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌ గత ఏడు రోజుల్లో, ఆరురోజులపాటు రికార్డు గరిష్ఠస్థాయిలో ముగిసింది. పలు దేశాల్లో పెట్టుబడులు జరిపే ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు)లోకి ఒక్క మే నెలలోనే 41 బిలియన్‌ డాలర్ల నిధులు తరలివచ్చాయి. 2021 తొలి ఐదు నెలల్లో ఈ ఫండ్స్‌ 295 బిలియన్‌ డాలర్లను ఆకర్షించాయి.

పెద్ద రిస్క్‌ ఒక్కటే

ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లకు పెద్ద రిస్క్‌ ఒక్కటే వుందని విశ్లేషకులు అంటున్నారు. ద్రవ్యోల్బణం ఆందోళనకరస్థాయికి చేరితే, అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచడం మొదలుపెట్టడంతో పాటు లిక్విడిటీ సరఫరాకు కళ్ళెం వేయవచ్చు. అదే జరిగితే ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కుతీసుకుంటారు. దాంతో మార్కెట్లో పెద్ద కరెక్షన్‌ వచ్చే ప్రమాదం వుంటుందని మార్కెట్‌ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ర్యాలీకి మరికొన్ని కారణాలు

కార్పొరేట్‌ లాభాలు: కరోనా సంక్షోభం నేపథ్యంలో చిన్న కంపెనీల నుంచి మార్కెట్‌ వాటాను చేజిక్కించుకోవడంతో లిస్టెడ్‌ కార్పొరేట్ల లాభాలు జోరుగా పెరిగాయి. 2020-21 మూడో క్వార్టర్లో కార్పొరేట్ల లాభాలు రూ.2,09,000 కోట్లకు పెరిగాయి. నాల్గో త్రైమాసికంలో కూడా ఇదే ట్రెండ్‌ కనపడుతున్నది. 2021-22లో వీటి లాభాలు మరింత వృద్ధిచెందుతాయన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి.

ఉద్దీపన అంచనాలు: కొవిడ్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించవచ్చన్న అంచనాలు మార్కెట్లో బలంగా వున్నాయి. ఈ ఉద్దీపనతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాల్ని మించుతుందన్న ఇన్వెస్టర్ల భావన కూడా స్టాక్‌ సూచీలు రికార్డుల పరంపరకు కారణమవుతున్నది.

వ్యాక్సినేషన్‌ ప్రభావం: కేంద్రం తాజాగా ప్రకటించిన వ్యాక్సినేషన్‌ విధానంతో ఈ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని, దీంతో 2021-22 ద్వితీయ త్రైమాసికానికల్లా సాధారణ పరిస్థితులు నెలకొని, కరోనా థర్డ్‌వేవ్‌ అంతగా కలవరపర్చదన్న విశ్వాసం ఇన్వెస్టర్లలో నెలకొంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పరుగెందాకా!

ట్రెండింగ్‌

Advertisement