శనివారం 28 మార్చి 2020
Business - Feb 17, 2020 , 23:49:57

ఎంఎస్‌ఎంఈలకు రూ.50 వేల కోట్లు

ఎంఎస్‌ఎంఈలకు రూ.50 వేల కోట్లు
  • వచ్చే రెండేండ్లలో రుణాలు అందిస్తాం: ఐవోబీ ఈడీ ఏకే శ్రీవాత్సవ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17: దేశీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎంఎస్‌ఎంఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌. ఈ రంగానికి ఇప్పటి వరకు రూ.31 వేల కోట్లకు పైగా రుణాలు అందించిన బ్యాంక్‌..వచ్చే ఏడాదిన్నర నుంచి రెండేండ్లలోగా వీటిని రూ.50 వేల కోట్లకు పెంచనున్నట్లు బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌ కుమార్‌ శ్రీవాత్సవ తెలిపారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి రుణాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా 200 శాఖలను గుర్తించినట్లు, అలాగే 700 మంది ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు హైదరాబాద్‌లో జరిగిన ఎంఎస్‌ఎంఈ కస్టమర్స్‌ అవుట్‌రిచ్‌ ప్రొగ్రామ్‌కు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ఈ వివరాలు వెల్లడించారు. 


బ్యాంక్‌ ప్రధానంగా రిటైల్‌, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగాలకు అత్యధికంగా రుణాలు అందిస్తున్నదన్నారు. వీటిలో ఎంఎస్‌ఎంఈ వాటానే అధికమని పేర్కొన్న ఆయన..రూ.450 కోట్ల మేర గృహ రుణాలు, బంగారు-ఆభరణాల తాకట్టుపై రూ.3,200 కోట్ల రుణాలు అందించినట్లు, ఈ ఏడాది రూ.5 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరాసరిగా 2 శాతంగా నమోదవుతున్న ఎన్‌ఐఎం వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి మూడు శాతానికి చేరుకునే దానిపై ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు. మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రస్తుత త్రైమాసికంలో బ్యాంక్‌ లాభాల్లోకి వచ్చే అవకాశం ఉన్నదన్న ఆయన..గతేడాదితో పోలిస్తే నికర ఎన్‌పీఏ ఆరు శాతం కంటే తగ్గిందన్నారు. 


2020-21లో ఎఫ్‌పీవోకి బ్యాంక్‌

వచ్చే ఏడాది ఎఫ్‌పీవో  ద్వారా నిధులను సేకరించేయోచనలో బ్యాంక్‌ ఉన్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. ఎంతమేర సేకరించే విషయంపై ఆయన స్పష్టతనివ్వకపోయినప్పటికీ త్వరలో జరుగనున్న బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. 


logo