మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 04, 2020 , 00:18:06

ఇక వడ్డింపులే!

ఇక వడ్డింపులే!
  • ఈ ఏడాది ఆర్బీఐ ద్రవ్యసమీక్షలపై నిపుణుల అంచనా
  • ద్రవ్యోల్బణం కట్టడికి కీలక వడ్డీరేట్ల పెంపు

ముంబై, ఫిబ్రవరి 3: ఈ ఏడాది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్లను పెంచే అవకాశాలే ఎక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు కీలక వడ్డీరేట్లయిన రెపో, రివర్స్‌ రెపోలను ఆర్బీఐ పెంచే వీలుందని సోమవారం గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అన్నది. కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు లక్ష్యాలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణంపై ఆ ప్రభావం ఉంటుందని, అన్ని వస్తూత్పత్తుల ధరలకు రెక్కలు రావచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆర్బీఐ ఆమోదయోగ్య స్థాయిని ద్రవ్యోల్బణం గణాంకాలు దాటిపోయాయని గుర్తుచేసిన గోల్డ్‌మన్‌ సాచ్స్‌ నిపుణులు.. ఈ వారంలో జరిగే ద్రవ్యసమీక్షలో రెపో, రివర్స్‌ రెపో వడ్డీరేట్ల పెంపు ఉండవచ్చని చెప్పారు. మరోవైపు ఈసారి కూడా వడ్డీరేట్లను యథాతథంగా ఆర్బీఐ ఉంచవచ్చని డీబీఎస్‌ అంచనా వేసింది.


బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సైతం కీలక వడ్డీరేట్లు డిసెంబర్‌ సమీక్షలోలాగే ఎక్కడివక్కడే ఉండే వీలుందన్నది. జనవరి ప్రధాన ద్రవ్యోల్బణం 6.7 శాతానికి దిగజారవచ్చంటున్నది. డిసెంబర్‌లో ఐదేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 7.3 శాతంగా నమోదైంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల మధ్య వడ్డీరేట్ల పెంపు సాహసం ఆర్బీఐ చేయకపోవచ్చన్న అభిప్రాయాలూ పలువురు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 6-6.5 శాతానికి పెరుగవచ్చన్న ఇటీవలి ఆర్థిక సర్వే అంచనాలూ ఆర్బీఐ ద్రవ్యసమీక్షను సానుకూలంగా ప్రభావితం చేయవచ్చని అంటున్నారు. కాగా, గతేడాది మొత్తంగా రెపో రేటు 135 బేసిస్‌ పాయింట్లు తగ్గిన సంగతి విదితమే.


ద్రవ్యలోటు లక్ష్యం సవాలే

వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) జీడీపీలో ద్రవ్యలోటును 3.8 శాతానికి కట్టడి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం సవాలేనని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అభిప్రాయపడింది. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య ఉన్న వ్యత్యాసమే ఈ ద్రవ్యలోటు. పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రభుత్వ అవసరాలు తీరేందుకు పెట్టుబడుల ఉపసంహరణే మార్గంగా ఉంటుందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.65,000 కోట్లను సమీకరించాలని నిర్దేశించుకున్న మోదీ సర్కారు.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.2.10 లక్షల కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే జీడీపీలో ద్రవ్యలోటును 3.8 శాతానికి కట్టడి చేస్తామన్న లక్ష్యాన్ని తాజా బడ్జెట్‌లో పెట్టింది. అయినప్పటికీ అసాధ్యమేనన్న అంచనాలు నిపుణుల నుంచి వస్తుండటం గమనార్హం.


చివరి ద్రవ్యసమీక్ష 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష మంగళవారం మొదలవుతున్నది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ సమీక్ష ఫలితాలు గురువారం వెల్లడి అవుతాయని సోమవారం ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు మూడు నెలలకోసారి త్రైమాసిక ద్రవ్యసమీక్షల్ని ఆర్బీఐ నిర్వహించేది. ఇప్పుడు రెండు నెలలకోసారి ద్వైమాసిక ద్రవ్యసమీక్షల్ని చేపడుతున్నది. దీంతో ఏడాదికి ఆరు జరుగుతుండగా, ఈ నెలదే చివరి సమీక్ష. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకానున్న విషయం తెలిసిందే.


logo
>>>>>>