e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home Top Slides కేరళ టు తెలంగాణ.. క్యూ క‌డుతున్న కార్పొరేట్ సంస్థ‌లు

కేరళ టు తెలంగాణ.. క్యూ క‌డుతున్న కార్పొరేట్ సంస్థ‌లు

  • కిటెక్స్‌ బాటలో మరికొన్ని కంపెనీలు
  • రాష్ర్టానికి వస్తున్న పెట్టుబడిదారులు
  • ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ఆసక్తి
  • అధికారులతో చర్చలు

మొన్న కిటెక్స్‌.. నిన్న మలబార్‌ గోల్డ్‌.. రేపు మరెన్నో.. కేరళ నుంచి తెలంగాణకు కార్పొరేట్‌ సంస్థలు క్యూ కడుతున్నాయిప్పుడు.
వ్యాపార, పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చూసి పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చేస్తున్నారు.
లైఫ్‌ సైన్సెస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు చెందిన దాదాపు అర డజనుకుపైగా సంస్థలు తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
అధికారులతో ఆయా కంపెనీల ప్రతినిధులు చర్చలూ జరుపుతున్నారు. వచ్చే కొద్ది నెలల్లో దాదాపు 50 కంపెనీల వరకు మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే అవకాశమున్నది.

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (నమస్తే తెలంగాణ): కిటెక్స్‌, మలబార్‌ గోల్డ్‌ బాటలోనే మరికొన్ని కేరళ కంపెనీలు పయనిస్తున్నాయి. కిడ్స్‌వేర్‌కు దేశంలోనేగాక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కిటెక్స్‌ సంస్థ.. కేరళ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకొని తెలంగాణలో పెట్టిన విషయం తెలిసిందే. రూ.2,400 కోట్లతో రెండు చోట్ల పరిశ్రమలు స్థాపిస్తున్న సంగతీ విదితమే. ఇక కేరళకే చెందిన వజ్రాభరణాల తయారీ దిగ్గజం మలబార్‌ గోల్డ్‌ సైతం రాష్ట్రంలో రూ.750 కోట్లతో నగల తయారీతోపాటు రిఫైనరీని స్థాపించనున్నట్లు గత వారం ప్రకటించింది. ఈ వరుసలోనే తాజాగా అర డజనుకుపైగా కేరళకు చెందిన కంపెనీలు తెలంగాణ పరిశ్రమల శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాయిప్పుడు.

- Advertisement -

కిటెక్స్‌ నిష్క్రమణతోనే..
అంతర్జాతీయంగా మంచి పేరున్న కిటెక్స్‌ కంపెనీ.. కేరళను వదిలిపెట్టడం అక్కడి కంపెనీలను ఆలోచనలో పడేసినట్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. కిటెక్స్‌ తెలంగాణకు వెళ్లిందంటే మనమూ కండ్లు మూసుకొని అక్కడికి వెళ్లవచ్చనే భావన కేరళ పారిశ్రామిక వర్గాల్లో ఉందని సదరు వర్గాలు పేర్కొంటున్నాయి. ఏటా వేల కోట్ల రూపాయల విలువైన వస్ర్తాలను అమెరికాకు కిటెక్స్‌ ఎగుమతి చేస్తున్నది. అగ్రరాజ్యానికే ఇంత పెద్ద ఎత్తున కిడ్స్‌వేర్‌ను ఎగుమతి చేస్తున్న సంస్థ తెలంగాణను కేంద్రంగా చేసుకోవడం ఆషామాషీ కాదని ఇప్పుడు ఇండస్ట్రీ టాక్‌. కిటెక్స్‌ రాకతో పెద్దగా ప్రచారం చేసుకోకుండానే రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చే దారులు ఏర్పడ్డాయంటున్నారు.

మెరిసిన వరంగల్‌
తెలంగాణ సాధనకు ముందు ఉద్యమాలతో ఉరకలెత్తిన ఓరుగల్లు.. స్వరాష్ట్రంలో పారిశ్రామిక పరుగులను సంతరించుకున్నది. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన యంగ్‌వన్‌ సంస్థ వరంగల్‌లో పరిశ్రమ స్థాపించడం రాష్ర్టానికే కలిసొచ్చే అంశమని ఆర్థిక, వ్యాపార, పారిశ్రామిక పెద్దలు అభివర్ణిస్తున్నారు. యంగ్‌వన్‌ సంస్థ బంగ్లాదేశ్‌లో అతిపెద్ద కర్మాగారాన్ని నిర్వహిస్తూ ప్రపంచ దేశాలకు వస్ర్తాలను ఎగుమతి చేస్తున్నది. అలాంటి యంగ్‌వన్‌.. తెలంగాణలోకి అదీ వరంగల్‌కు రావడం ఇక్కడి పారిశ్రామికాభివృద్ధికి బలం చేకూరుస్తున్నదంటున్నారు. ఈ క్రమంలో కిటెక్స్‌ రాక గొప్ప మైలురాయిగానే అంతా పేర్కొంటున్నారు.

‘కేరళ ప్రభుత్వం పారిశ్రామిక వ్యతిరేక విధానాలతో పరిశ్రమ విసిగిపోయింది. అక్కడ ఏ ఒక్క యూనియన్‌ మాట వినకపోయినా ప్రభుత్వం నుంచి వేధింపులు మొదలవుతాయి. ఎవరినైనా ఎంతకాలం సంతృప్తిపరచగలం. అందుకే మా తరహాలోనే అనేక కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో కనీసం 50 వరకు కేరళ కంపెనీలు తెలంగాణకు వస్తాయి. త్వరలోనే వివరాలన్నీ బయటకొస్తాయి. ఏయే కంపెనీలు వస్తున్నాయో నాకు తెలుసు. ఆయా సంస్థలు వాటి ప్రయత్నాల్లో అవి ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు సరైన గుర్తింపు ఇస్తున్నది. ముఖ్యంగా కేటీఆర్‌ రాష్ర్టాభివృద్ధితోపాటు ప్రజల ఉపాధి కల్పనపట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారు’
-సాబూ ఎం జాకబ్‌, కిటెక్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌

‘కేరళకు చెందిన పలు కంపెనీలు మాతో చర్చలు జరుపుతున్నాయి. లైఫ్‌ సైన్సెస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు చెందిన సంస్థలు ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. రెండు మెడికల్‌ డివైజెస్‌ తయారీ కంపెనీలు సుల్తాన్‌పూర్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. అలాగే కొన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలు కూడా నగర శివార్లలోని పారిశ్రామికవాడల్లో అనువైన ప్రాంతాల కోసం చూస్తున్నాయి. మొత్తంగా అర డజనుకుపైగా కేరళ కంపెనీలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. చర్చలు ఫలప్రదమైతే త్వరలోనే వివరాలన్నీ అధికారికంగా వెల్లడిస్తాం’
– జయేశ్‌ రంజన్‌, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement