బుధవారం 03 మార్చి 2021
Business - Feb 20, 2021 , 00:43:42

పెట్టుబడి @ రియల్‌

పెట్టుబడి @ రియల్‌

ఎఫ్‌డీ, స్టాక్స్‌, గోల్డ్‌కన్నా ప్రాపర్టీలు కొనడమే బెటర్‌ 

మళ్లీ కరోనాకు ముందు స్థాయికి చేరుకునే దశలో నిర్మాణ రంగం 

హాట్‌కేక్‌లుగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల్లు 

సీఐఐ-అనరాక్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు 

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): కరోనా భయం తొలిగిన నేపథ్యంలో ప్రజలు మళ్లీ పెట్టుబడుల వైపు చూస్తున్నారు. ఈ సమయంలో వారికి ఉత్తమ గమ్యస్థానంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం నిలుస్తున్నది. చేతిలో కొంత డబ్బు ఉంటే ఇల్లో.. స్థలమో కొందామని ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, స్టాక్‌ మార్కెట్‌లో షేర్ల కొనుగోలు, బంగారంపై పెట్టుబడికన్నా ఓ ప్రాపర్టీ కొనడమే బెటర్‌ అని భావిస్తున్నట్టు ఇండస్ట్రీ బాడీ ‘సీఐఐ’, కన్సల్టెంట్‌ సంస్థ ‘అనరాక్‌' సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ‘ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌ విజన్‌-2025’ పేరుతో విడుదల చేసిన నివేదికలో కరోనా ప్రభావం తగ్గడంతో ఎక్కువమంది ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా డబుల్‌  బెడ్‌రూమ్‌ ఇండ్ల కొనుగోలుకే ఎక్కుమంది ఆసక్తి చూపుతున్నట్టు చెప్పింది. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా హైదరాబాద్‌సహా 20 నగరాల్లో 3,900 మందితో సర్వే నిర్వహించాయి. ఎన్నారైలనూ ఈ మెయిల్‌, వెబ్‌ లింక్‌ ద్వారా సంప్రదించింది. 

ఇల్లు కొనేందుకు సరైన సమయం 

కరోనా భయం తొలగడం.. గృహరుణాల వడ్డీ రేట్లు తగ్గడం, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు తమ వెంచర్లపై ఆఫర్లు ప్రకటిస్తుండటంతో ఇల్లు కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నట్టు తేలింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు కొనడమే ఉత్తమమని 62 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక 24 శాతం మంది తాము ఇప్పటికే ప్రాపర్టీని బుక్‌ చేసుకున్నామని చెప్పారు. ఆఫర్లతోపాటు సొంతిల్లు ఉంటేనే నయమని కరోనా నేర్పిన పాఠమే ఇందుకు కారణమని వెల్లడించారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ తర్వాత ప్రారంభమైన వెంచర్లు, ప్రాజెక్టులపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే కొత్త ప్రాజెక్టులపై ఓ కన్నేసి ఉంచుతున్నామని 38 శాతం మంది అన్నారు. 26 శాతం మంది తాము కొత్త ప్రాజెక్టుల్లోని ఇండ్లనే కొంటామని స్పష్టం చేశారు. ఇది కరోనాకు ముందుతో పోల్చితే 4 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

లగ్జరీ ఇండ్లవైపు ఎన్నారైల చూపు 

ఎన్నారైలు ఎక్కువగా విలాసవంతమైనప్రాజెక్టులవైపు మొగ్గు చూపుతున్నట్టు సర్వేలో తేలింది. 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే వైపు వారు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వెల్లడించింది. రూ.90 లక్షల నుంచి రూ.2.5 కోట్ల మధ్య వెచ్చించేందుకు వారు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.  

సర్వే ముఖ్యాంశాలు

  • ఎప్పటిమాదిరిగానే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, ఫ్లాట్లు హాట్‌కేక్‌లుగా మారాయి.
  • 69 శాతం మంది విశాలంగా ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకే మొగ్గు చూపుతున్నారు. కొవిడ్‌కు ముందు ఇది 38 శాతంగా ఉండేది. 
  • వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్‌ తరగతుల నేపథ్యంలో కొత్తగా కొనే ఇల్లు పెద్దగా ఉండాలని చాలామంది ఆలోచిస్తున్నారు. శివారు ప్రాంతాలైనా సరే విశాలంగా ఉండాలని కోరుకుంటున్నారు.
  • బ్రాండెడ్‌ డెవలపర్లపై క్రమంగా నమ్మకం పెరుగుతున్నది. కొవిడ్‌కు ముందు 52 శాతం మంది బ్రాండెడ్‌ డెవలపర్లు కావాలని కోరగా, ఇప్పుడు 61 శాతానికి పెరిగింది. 
  • పట్టణాలు, నగరాల్లో కొన్నేండ్లుగా భూముల ధరలు క్రమంగా పెరుగుతుండటం, కరోనా కష్టకాలాన్ని సైతం రియల్‌ ఎస్టేట్‌ రంగం విజయవంతంగా తట్టుకోవడంతో చాలామంది ప్రాపర్టీలను కొనడం పెట్టుబడిగా భావిస్తున్నారు. మరో ఐదేండ్ల వరకు భూముల ధరలు పెరుగుతూనే ఉంటాయని 83 శాతం మంది భావిస్తున్నారు.
  • కొవిడ్‌కు ముందు 17 శాతం మంది ప్రాపర్టీపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపగా ఇప్పుడు 48 శాతానికి వారి సంఖ్య పెరిగింది. 
  • 57 శాతం మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కన్నా ఏదైనా ప్రాపర్టీ కొనడమే లాభమని యోచిస్తున్నారు. 
  • 59 శాతం మంది స్టాక్‌ మార్కెట్‌, బంగారంపై పెట్టుబడి కన్నా స్థలాలు, ఇండ్లు కొనుగోలు చేయడమే ఉత్తమమని అన్నారు.

VIDEOS

logo