శనివారం 31 అక్టోబర్ 2020
Business - Aug 17, 2020 , 00:16:31

డబ్బులు ఊరికే రావు

డబ్బులు ఊరికే రావు

  • ఇప్పటి నుంచే నాలుగు రాళ్లు దాచుకోవాలి
  • ప్రణాళికాబద్ధంగా మదుపు ఆరంభించాలి
  • లేదంటే జీవిత చరమాంకంలో ఇబ్బందులే

ఉద్యోగంతో మీ జీవితం సాఫీగా సాగుతున్నదా? ఏ లోటూ లేకుండా నిశ్చింతగా ఉన్నారా? ఇదేవిధమైన జీవన విధానాన్ని రిటైర్మెంట్‌ తర్వాత కూడా కొనసాగించాలని కోరుకొంటున్నారా? ఈ కోర్కె నెరవేరాలంటే ఇప్పటి నుంచే మేల్కోవాలి. తగిన జాగ్రత్తలతో ముందుకు సాగాలి. కట్టుదిట్టమైన పొదుపు ప్రణాళికలతో నాలుగు రాళ్లు దాచుకోవాలి. ఈ విషయంలో జాప్యం ఏమాత్రం తగదు. లేదంటే జీవిత చరమాంకంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే.. డబ్బులు ఎవరికీ ఊరికే రావు.

ఇంటి ఖర్చుల నిమిత్తం ప్రస్తుతం నెలకు రూ.50 వేల వరకు వెచ్చిస్తున్న మీరు మరో 30 ఏండ్ల తర్వాత కూడా ఇదేవిధమైన జీవన విధానాన్ని కొనసాగించాలంటే.. అప్పుడు నెలకు దాదాపు రూ.2.16 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉద్యోగ విరమణ తర్వాత ఇంత మొత్తాన్ని సంపాదించాలంటే 6 శాతం యాన్యుటీ రేటు ప్రకారం మీరు దాదాపు రూ.4.32 కోట్ల మూల నిధిని సమకూర్చుకోవాలి. ఉద్యోగంలో చేరిన తొలినాటి నుంచే మదుపు మొదలుపెడితే ఈ మొత్తాన్ని మీరు సులభంగానే కూడబెట్టగలుగుతారు. ఈ విషయంలో ఆలస్యం ఏమాత్రం పనికిరాదు. కనీసం ఐదేండ్లు ఆలస్యం చేసినా మీ రిటైర్మెంట్‌ మూల నిధి భారీగా తగ్గుతుంది. దీంతో జీవిత చరమాంకంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మదుపులో ఐదేండ్ల జాప్యం మీ రిటైర్మెంట్‌ కిట్టీని ఎంత దారుణంగా దెబ్బతీస్తుందన్న దానిపై మేము వేసిన సాధారణ లెక్క ఇదీ..

కనీసం రూ.2 వేలతోనైనా పొదుపు ప్రారంభించాలి

ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ప్రతినెలా రూ.5 వేలు వెనకేయడం మీకు కష్టమే కావచ్చు. అయినప్పటికీ కనీసం రూ.2 వేలతోనైనా వెంటనే మదుపు ప్రారంభించాలి. ఉద్యోగ విరమణ వరకూ ఆ మొత్తాన్ని ఏటేటా 10 శాతం చొప్పున పెంచుకొంటూ ముందుకుసాగాలి. ఈ విధంగా మీరు 25వ పడిలో ప్రవేశించిన నాటి నుంచే చేయగలిగితే ఉద్యోగ విమరణ నాటికి రూ.3.19 కోట్ల మూల నిధిని కూడబెట్టగలుగుతారు. మీ మదుపు ఎంత ఆలస్యమైతే రిటైర్మెంట్‌ మూల నిధి అంత భారీగా తగ్గుతుంది. కనుక మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరాలంటే యుక్త వయసులోనే మేల్కొని మదుపు ప్రారంభించడం ఎంతో శ్రేయస్కరం. మీ సొంతింటి కలను సాకారం చేసుకోవడం లేదా చిన్నారుల విద్యకు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకోవడం లాంటి ఇతర ఆర్థిక లక్ష్యాల సాధనకూ ఇదే సూత్రం వర్తిస్తుందని గ్రహించాలి.

పదేండ్లు ఆలస్యమైతే మిగిలేది రూ.95 లక్షలే

ప్రస్తుతం 25 ఏండ్ల వయసులో ఉన్న నిశ్చిత, విక్రమ్‌, అభిజీత్‌ తమ రిటైర్మెంట్‌ మూల నిధి కోసం సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో ప్రతినెలా రూ.5 వేల పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారనుకొందాం. వీరిలో నిశ్చిత ఇప్పుడే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని, విక్రమ్‌ ఐదేండ్ల తర్వాత, అభిజీత్‌ 35వ పడిలో ప్రవేశించిన తర్వాత ‘సిప్‌' మొదలుపెట్టారని అనుకొంటే.. అప్పుడు అభిజీత్‌ కేవలం 25 ఏండ్లపాటే రిటైర్మెంట్‌ మూల నిధిని కూడబెట్టగలుగుతాడు. ఈ విధంగా చూస్తే ఉద్యోగ విరమణ (60 ఏండ్ల వయసు) నాటికి నిశ్చిత కిట్టీలో రూ.3.24 కోట్లు, విక్రమ్‌ కిట్టీలో రూ.1.76 కోట్లు జమ అవుతాయి. అభిజీత్‌ కేవలం రూ.95 లక్షలే కూడబెట్టగలుగుతాడు. మదుపు ఎంత త్వరగా ఆరంభిస్తే అంత మంచిదని ఈ లెక్కను బట్టే మీరు తేలిగ్గా తెలుసుకోవచ్చు.