బుధవారం 20 జనవరి 2021
Business - Dec 05, 2020 , 02:35:17

మూడోసారీ

మూడోసారీ

 • కీలక వడ్డీరేట్లు యథాతథం
 • ద్రవ్యసమీక్షలో రెపో, రివర్స్‌ రెపో జోలికి వెళ్లని ఆర్బీఐ
 • వృద్ధిరేటుపై మెరుగైన అంచనాలు
 • ఒత్తిళ్లు తగ్గితే వడ్డీరేట్ల కోతలుంటాయని సంకేతాలు

‘వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం కేంద్ర బడ్జెట్‌ వృద్ధిదాయకంగా ఉంటుందని భావిస్తున్నాను. మునుపెన్నడూ లేనివిధంగా కరోనా వైరస్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఆర్థిక వివేకాన్ని ప్రదర్శిస్తుందని అనుకుంటున్నాను’

 -ద్రవ్యసమీక్ష అనంతరం విలేకరులతో దాస్‌

ముంబై, డిసెంబర్‌ 4: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగానే ఉంచాలని నిర్ణయించింది. దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ ఇబ్బందులు వెంటాడుతున్నా.. ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ద్రవ్యసమీక్షను చేపట్టింది. ఈ క్రమంలోనే వరుసగా మూడోసారి రెపో, రివర్స్‌ రెపోల జోలికి వెళ్లలేకపోయింది. శుక్రవారం ఇక్కడ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ ప్రకటించింది. ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా రెపో, రివర్స్‌ రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం రెపో రేటు 4 శాతంగా, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి కీలక వడ్డీరేటును ఆర్బీఐ 115 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ద్రవ్యోల్బణ భయాల మధ్య ఆగస్టులో ఈ కోతలకు బ్రేకులు పడగా, గత ద్రవ్యసమీక్షలోనూ యథాతథంగానే ఉన్నాయి. కాగా, ద్రవ్యసమీక్ష అనంతరం విలేకరులతో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ.. ‘పరిస్థితులు మెరుగుపడితే మున్ముందు ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లను తగ్గిస్తాం’ అని భరోసా ఇచ్చారు. ఇదిలావుంటే ఊహించిన దానికంటే వేగంగా దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నదన్న దాస్‌.. ఈ అక్టోబర్‌-డిసెంబర్‌, జనవరి-మార్చి త్రైమాసికాల్లో వృద్ధిరేటు ప్రతికూల దశలోకి ప్రవేశిస్తుందని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబర్‌లో జీడీపీ 6.5 శాతం వరకు బలపడగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా, యెస్‌ బ్యాంక్‌-లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ విలీన ప్రక్రియలో బ్యాంకర్ల బాండ్లు, షేర్లను రద్దు చేయడాన్ని దాస్‌ ఈ సందర్భంగా సమర్థించుకున్నారు. డిపాజిటర్ల ప్రయోజనార్థమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై తాజాగా తీసుకున్న చర్యలపై స్పందిస్తూ.. డిజిటల్‌ బ్యాంకింగ్‌లో విశ్వాసాన్ని బ్యాంకర్లు నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఇక బ్యాంకింగ్‌ రంగంలోకి కార్పొరేట్ల అనుమతిపై మాట్లాడుతూ.. అది ఆర్బీఐ అంతర్గత కమిటీ సూచన అని దాస్‌ చెప్పారు. ఆర్బీఐ నిర్ణయం కాదని స్పష్టం చేశారు.

డివిడెండ్లు చెల్లించొద్దు..

గత ఆర్థిక సంవత్సరానికి (2019-20) సంబంధించి ఎటువంటి డివిడెండ్లను చెల్లించవద్దని వాణిజ్య, సహకార బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టం చేసింది. కొవిడ్‌-19 సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఆర్బీఐ ఈ సూచన చేసింది. కరోనా మహమ్మారి విజృంభణతో తీవ్ర ఒత్తిడి, అనిశ్చితి కొనసాగుతున్నందున లాభాలను కాపాడుకుని ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచేందుకు బ్యాంకులు అధిక ప్రాధాన్యమివ్వాలని ఆర్బీఐ పేర్కొన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబర్‌)లో బ్యాంకుల ఆర్థిక పనితీరును సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజర్వు బ్యాంకు వెల్లడించింది. కొవిడ్‌-19 సంక్షోభ నేపథ్యంలో ఓవైపు ఆర్థిక స్థిరతకు ప్రాధాన్యమిస్తూనే మరోవైపు రుణ గ్రహీతలపై ఒత్తిడిని తగ్గించడం, రుణ సదుపాయాలను పెంచడంపై దృష్టి సారించినట్టు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు.

రూ.5 వేల వరకు కాంటాక్ట్‌లెస్‌ కార్డు లావాదేవీలు

 • జనవరి 1 నుంచి అమలు 

డిజిటల్‌ చెల్లింపులకు ఊతమిచ్చేందుకు రిజర్వు బ్యాంకు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో భద్రమైన, సురక్షితమైన డిజిటల్‌ లావాదేవీలను అందించేందుకు కాంటాక్ట్‌లెస్‌ కార్డ్‌ లావాదేవీలు, ఈ-మాండేట్‌ల పరిమితిని పెంచింది. ఇప్పటివరకు పిన్‌ నంబర్‌ అవసరం లేకుండా రూ.2 వేల వరకు కాంటాక్ట్‌లెస్‌ కార్డ్‌ లావాదేవీలు నిర్వహించుకునే వీలున్నది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఆ పరిమితిని రూ.5 వేలకు పెరిగింది. ఇది వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. సాంకేతికత విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది ప్రజలు డిజిటల్‌ లావాదేవీల నిర్వహణకే మొగ్గు చూపుతున్నారని, దీంతో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఇప్పటికే నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌ లావాదేవీలపై చార్జీలను ఎత్తివేశామని ఆయన గుర్తు చేశారు.

ముఖ్యాంశాలు

 • 4 శాతం వద్ద రెపో రేటు
 • 3.35 శాతంగా రివర్స్‌ రెపో
 • ఈసారి జీడీపీ మైనస్‌ 7.5 శాతంగా అంచనా
 • క్యూ3లో 0.1 శాతం, క్యూ4లో 0.7 శాతంగా అంచనా
 • రిటైల్‌ ద్రవ్యోల్బణం క్యూ3లో 6.8 శాతంగా నమోదు కావచ్చు
 • క్యూ4లో 5.8 శాతానికి తగ్గొచ్చు
 • పునర్నిర్మాణం దిశగా పీఎంసీ బ్యాంక్‌.. పెట్టుబడులకు మదుపరుల ఆసక్తి
 • త్వరలో డిజిటల్‌ పేమెంట్‌ సెక్యూరిటీ నియంత్రణ మార్గదర్శకాలు
 • ఎల్‌ఏఎఫ్‌, ఎంఎస్‌ఎఫ్‌లతో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు మరింత నగదు
 • ఈ నెల 14నుంచి నిరంతర ఆర్టీజీఎస్‌ సేవలు

ఎవరేమన్నారు?

‘కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం జీడీపీకి ఊతమిస్తుంది. అయినప్పటికీ ఈ కష్టకాలంలో మరిన్ని వృద్ధిదాయక చర్యలు అవసరం’

-సంగీతా రెడ్డి, ఫిక్కీ అధ్యక్షురాలు

‘ఆర్బీఐ సరైన నిర్ణయం తీసుకున్నది. మార్కెట్‌లో ఉన్న ద్రవ్యలభ్యతను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నాం’

-చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌

‘ఆర్బీఐ నిర్ణయం ఊహించినదే. అయినప్పటికీ పరిస్థితులు అనుకూలిస్తే వడ్డీరేట్లను మున్ముందు సమీక్షల్లో తప్పక తగ్గిస్తామని ఎంపీసీ భరోసా ఇవ్వడం హర్షణీయం’

-దీపక్‌ సూద్‌, అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌

‘ఈ ఆర్థిక సంవత్సర ద్వితీయార్ధంలో దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న ఆర్బీఐ అంచనా వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఆశల్ని చిగురింపజేస్తున్నది’

-సంజయ్‌ అగర్వాల్‌, పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు

‘కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచడాన్ని స్వాగతిస్తున్నాం. గృహ రుణాలు ఆకర్షణీయ వడ్డీరేట్లకే అందుబాటులో ఉంటాయి. ఇది రియల్టీని బలపరుస్తుంది’

-నిరంజన్‌ హీరానందనీ, నరెడ్కో అధ్యక్షుడు


logo