సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jun 29, 2020 , 00:54:32

వ్యక్తిగత రుణం మంచిదే!

వ్యక్తిగత రుణం మంచిదే!

వ్యక్తిగత రుణాలను ఇప్పుడు చాలామందే తీసుకుంటున్నారు. రుణదాతలూ వీటిని ఎక్కువగానే ఇస్తున్నారు. అనుకోకుండా వచ్చిపడిన ఖర్చులను అధిగమించడానికి ఈ రుణాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత రుణాలపై సరైన అవగాహన ఉంటే డబ్బునూ ఆదా చేసుకోవచ్చు.

ఎలా డబ్బు ఆదా చేసుకోవచ్చు

వడ్డీరేట్లు తక్కువ


క్రెడిట్‌ కార్డులపై చెల్లించే వడ్డీ కంటే వ్యక్తిగత రుణాలపై చెల్లించే వడ్డీరేట్లే తక్కువ. కాబట్టి ఏదైనా కొనాలంటే క్రెడిట్‌ కార్డులకు బదులుగా వ్యక్తిగత రుణాలనే ఎంచుకోవడం ఉత్తమం. దీనివల్ల మీరు ఎంతోకొంత డబ్బును ఆదా చేసుకున్నట్లే. 

రుణ భారాన్ని తగ్గించుకోండి

అప్పటికే ఉన్న ఇతర రుణాల చెల్లింపులకు వ్యక్తిగత రుణాలపై తీసుకున్న సొమ్మును వాడుకోవచ్చు. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డు బకాయిలను వెంటనే తీర్చేయండి. పసిడిపై రుణాలు, స్వల్పంగా ఉన్న హోం లోన్లనూ తీర్చేయడం వల్ల తనఖా పెట్టిన ఆస్తులను విడిపించుకోవచ్చు. ఈఎంఐల భారమూ తగ్గుతుంది.

అదనపు చార్జీల నుంచి స్వేచ్ఛ

తరచూ క్రెడిట్‌ కార్డు రుణగ్రహీతలు తమపై అదనపు చార్జీలు పడుతున్నాయంటూ మొత్తుకుంటారు. కానీ వ్యక్తిగత రుణగ్రహీతలకు ఆ సమస్య ఉండదు. తీసుకున్న రుణాన్ని నెలసరి వాయిదాల్లో చెల్లించే వీలుంటుంది. పైగా వ్యక్తిగత రుణాలు ఫిక్స్‌డ్‌ రేట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌తో లభిస్తాయి.

మెరుగైన విధానంలో చెల్లించండి

వ్యక్తిగత రుణాలను పొందడానికి ముందే సులభతరమైన పద్ధతిలో చెల్లించే విధానాన్ని ఎంచుకోవడం ఉత్తమం. మన ఆర్థిక సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాలపరిమితి, వడ్డీరేటు, ఈఎంఐలపై నిర్ణయం తీసుకోవడం మంచిది.

వ్యక్తిగత రుణం అంటే?

వ్యక్తిగత రుణం అంటే పూచీకత్తు లేని రుణం. బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి వీటిని పొందవచ్చు. క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపులు, చదువు ఖర్చులు, పరిమిత శ్రేణి వాహనాలు, వ్యక్తిగత సాధానాల కొనుగోళ్లకు, ఇంట్లో శుభకార్యాలకు, ఇతరత్రా కార్యక్రమాలకు ఈ రుణాలను వాడుకోవచ్చు.


logo