బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Feb 13, 2020 , 00:13:56

సర్కారీ బీమా సంస్థలకు ధీమా

సర్కారీ బీమా సంస్థలకు ధీమా
  • రూ.2,500 కోట్ల సాయం.. కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ప్రభుత్వ రంగ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు కేంద్రం మూలధన సాయం చేస్తున్నది. మూడు కంపెనీల్లోకి రూ.2,500 కోట్లను చొప్పించేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. బుధవారం ఇక్కడ జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఓఐసీఎల్‌), నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఐసీఎల్‌), యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (యూఐఐసీఎల్‌)లకు నిధులివ్వాలన్న ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ‘ఈ మూడింటికి తక్షణ సాయంగా రూ.2,500 కోట్లను ఇచ్చేందుకు క్యాబినెట్‌ అనుమతించింది’ అని సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. 


ఈ సంస్థల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యానే ఈ తక్షణ సాయా న్ని ప్రకటిస్తున్నామని చెప్పారు. వచ్చే నెలాఖరుకల్లా ఈ మూడు సంస్థలను ఒక్కటిగా కలిపేయాలని కేంద్రం చూస్తు న్న నేపథ్యంలో ఈ సాయం అందుతున్నది. ఆర్థికంగా ఉమ్మడి సంస్థ బలోపే తం కావాలన్నదే దీని లక్ష్యం. 2018-19 కేంద్ర బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ మూడు సంస్థల విలీనాన్ని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. మార్చి 31, 2017 నాటికి ఈ సంస్థల బీమా ఉత్పత్తులు 200లకుపైగానే ఉన్నాయి. వీటి మొత్తం ప్రీమియం రూ.41,461 కోట్లుగా ఉన్నది. మార్కె ట్‌ వాటా సుమారు 35 శాతం.


‘వివాద్‌ సే విశ్వాస్‌' విస్తరణ

‘ప్రత్యక్ష పన్ను వివాద్‌ సే విశ్వాస్‌ బిల్లు, 2020’ పరిధిని పెంచాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఇక రుణ రికవరీ ట్రిబ్యునల్స్‌ (డీఆర్టీ)ల్లో పెండింగ్‌ కేసులకూ ఈ పథకం వర్తించనున్నది. ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో తెచ్చిన ఈ బిల్లు ప్రధాన లక్ష్యం.. పెద్ద ఎత్తున పేరుకుపోయిన పన్ను బకాయిలను తగ్గించడమే. పన్ను చెల్లింపుదారులకు రెవిన్యూ అధికారులు, ఆదాయం పన్ను అప్పీలెట్‌ ట్రిబ్యునల్‌, హైకోర్టులు, సుప్రీం కోర్టు మధ్య ఇరుక్కుపోయిన కేసులను పరిష్కరించేందుకు ఈ బిల్లును తీసుకువస్తున్నారు. గతేడాది నవంబర్‌దాకా వివాదాల్లో ఉన్న ప్రత్యక్ష పన్ను బకాయిలు రూ.9.32 లక్షల కోట్లుగా ఉన్నాయి. 


logo