గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 20, 2020 , 01:15:33

హత్య, ఆత్మహత్యలకూ బీమా కవరేజీ?

హత్య, ఆత్మహత్యలకూ బీమా కవరేజీ?

జీవిత బీమా అంటే ఏటా పాలసీదారులు ప్రీమియంలు చెల్లిస్తే.. అతను చనిపోతే ఆ కుటుంబాలకు సదరు బీమా సొమ్ము వస్తుంది. కానీ అదే పాలసీదారు హత్యకు గురైతే?.. లేదా ఆత్మహత్యకు పాల్పడితే తప్పక క్లయిమ్‌ సెటిల్మెంట్లలో సమస్యలు వస్తాయి. ఢిల్లీకి చెందిన ఓ పాలసీదారుడి విషయంలోనూ ఇదే జరిగింది. అయితే ఈ కేసులో హత్యకు గురైన పాలసీదారుడి నామినీకి బీమా సొమ్ము అందింది. పోలీస్‌ చార్జిషీట్‌లో పాలసీదారుడు అతిగా మద్యం సేవించి చనిపోయాడన్నట్లుండటంతో బీమా సంస్థ క్లయిమ్‌ను నిరాకరించింది. కానీ ఆ తర్వాత పోస్టుమార్టంలో గొంతు నులిమి చంపేశారని తేలడంతో రూ.21 లక్షల బీమాను అందించింది. దీంతో మద్యం, డ్రగ్స్‌ తీసుకుని మరణిస్తే వర్తించని బీమా.. హత్యకు గురైతే వచ్చింది. కాగా, పాలసీదారుల హత్యలో నామినీల పాత్ర ఉంటే వారి వారసులకు బీమా సొమ్మును ఇస్తారని ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధి చెప్తున్నారు. ఇక ఆత్మహత్య విషయానికొస్తే.. పాలసీ తీసుకున్న ఏడాదే చనిపోతే క్లయిమ్‌ రాదని, రెండో ఏడాది మరణిస్తే వస్తుందని అంటున్నారు. అయితే తొలి ఏడాదే ఆత్మహత్య చేసుకున్నా.. నామినీకి పాలసీ సొమ్ములో 80 శాతం ఇచ్చామని ఫ్యూచర్‌ జనరాలీ తదితర బీమా కంపెనీలు తెలిపాయి. పాలసీదారుడి ఆత్మహత్యకు నామినీ కారణం కాకపోతేనే బీమా వస్తుందంటున్నాయి. కాగా, స్కైడైవింగ్‌, పారాైగ్లెడింగ్‌, బంగీ జంప్‌ తదితర సాహసాల్లో చనిపోతే మాత్రం బీమా వర్తించట్లేదు. వరదలు, భూకంపాల్లో చనిపోతే బీమా రంగ రెగ్యులేటర్‌ ఐఆర్డీఏఐ సూచనల మేరకు బీమా సొమ్ము అందుతుంది. పాలసీ తీసుకోవడానికి ముందే మీకు ఏదైనా అనారోగ్యం ఉన్నా, ఆ కారణాల చేత చనిపోయినా బీమా సొమ్ము రాదు.  


logo