శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 16, 2020 , 00:02:01

ఇన్ఫోసిస్‌ లాభం 4,272 కోట్లు

ఇన్ఫోసిస్‌   లాభం 4,272 కోట్లు

  • దన్నుగా నిలిచిన డిజిటల్‌ సేవలు.. 
  • రూ.23 వేల కోట్లు దాటిన ఆదాయం

న్యూఢిల్లీ, జూలై 15: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించింది. కరోనా వైరస్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలోనూ ఇన్ఫోసిస్‌ తొలి త్రైమాసికానికిగాను ఏకంగా రూ.4,272 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,802 కోట్ల లాభంతో పోలిస్తే 12.4 శాతం వృద్ధిని కనబరిచింది. గతేడాది రూ.21,803 కోట్లుగా ఉన్న ఆదాయం ఈసారి 8.5 శాతం వృద్ధితో రూ.23,665 కోట్లకు చేరుకున్నట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. కరోనా వైరస్‌తో అంతర్జాతీయ వ్యాపారంపై తీవ్ర స్థాయిలో ప్రభావం   పడిందని కంపెనీ సీఈవో, ఎండీ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. గత త్రైమాసికంలో అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవడం లాభాల్లో వృద్ధికి కారణమని  ఆయన వెల్లడించారు.  భవిష్యత్తులో మ రిన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉం దన్నారు. గత త్రైమాసికంలో సంస్థ 1.7 బిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకోగా, డిజిటల్‌ సేవల ద్వారా వచ్చే ఆదాయం 25 శాతం పెరిగి 1.38 బిలియన్‌ డాలర్లకు(మొత్తం ఆదాయంలో 44.5 శాతం ) చేరుకున్నది. 

ఆర్థిక ఫలితాల్లో ముఖ్య అంశాలు..

  • డాలర్ల రూపంలో నికర లాభం 3.1 శాతం పెరిగి 564 మిలియన్‌ డాలర్లకు, ఆదాయం 3.12 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 
  • జూన్‌ చివరి నాటికి 2,39,233 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వలసలు 11.7 శాతంగా ఉన్నాయి. 
  • కొత్తగా తీసుకున్న ఉద్యోగాల్లో 20 వేల మంది ఫ్రెషర్లు ఉన్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 
  • అమెరికా వర్క్‌ వీసాలను రద్దు చేసినప్పటికీ కంపెనీ కార్యాకలాపాలపై ఎలాంటి ప్రభావం పడబోదని తెలిపింది. 
  • ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా బాబీ పరిఖ్‌ నియమించుకున్నది సంస్థ. 
  • కంపెనీకి వచ్చిన ఆదాయంలో ఉత్తర అమెరికా వాటా 61.5 శాతం కాగా, యూరప్‌  వాటా 24 శాతం, భారత్‌ నుంచి 2.9 శాతం, మిగతా దేశాల నుంచి 11.6 శాతం చొప్పున సమకూరింది. 
  • కంపెనీ షేరు ధర 6.16 శాతం ఎగబాకి రూ.831.45 వద్ద స్థిరపడింది. 

ఈ ఏడాదిలో 2 శాతం వరకు వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో 2 శాతం వరకు వృద్ధిని నమోదు చేసుకునే అవకాశాలున్నాయని అవుట్‌లుక్‌లో వెల్లడించింది. ఏప్రిల్‌ నెలలో ఆర్థిక ఫలితాల విడుదల చేసే సమయంలో అవుట్‌లుక్‌ను విడుదల చేయని సంస్థ..ఈసారి మాత్రం ముందస్తు అంచనాలను విడుదల చేసింది. 


logo