గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 07, 2020 , 00:32:25

కోలుకోని పరిశ్రమ

కోలుకోని పరిశ్రమ

  • మందగమనంలో మార్కెట్‌, పుంజుకోని కొనుగోళ్లు
  • వేధిస్తున్న నిధుల సమస్య, కూలీల కొరత.. 
  • ఫిక్కి-ధృవ తాజా సర్వేలో వెల్లడి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం నుంచి పరిశ్రమలు ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. లాక్‌డౌన్‌ నుంచి అన్‌లాక్‌ 2 మొదలైనా విస్తృత శ్రేణిలో కార్యకలాపాలను నిర్వహించలేకపోతున్నాయి. 45% సంస్థలే తమ పూర్తి సామర్థ్యంలో 70 శాతానికిపైగా ఉత్పత్తిని చేపట్టగలుగుతున్నాయని, 30% సంస్థలు 70% ఉత్పత్తికే పరిమితమవుతున్నాయని తాజా సర్వేలో తేలింది. మిగిలిన 25% సంస్థలు 70% కంటే తక్కువ ఉత్పత్తినే చేస్తున్నాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ కామర్స్‌ ఆఫ్‌ ఛాంబర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కి), ధృవ అడ్వయిజర్స్‌ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వివరాలను సోమవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా 100 సంస్థలపై ఏప్రిల్‌లో ఒకసారి, జూన్‌లో మరోసారి పరిశ్రమల కార్యకలాపాలపై సర్వే చేశారు. దీంతో పారిశ్రామిక రంగాన్ని పడిపోయిన కొనుగోళ్లు, నిధుల కొరత వేధిస్తున్నాయని స్పష్టమైంది. అన్‌లాక్‌ 1తో పరిశ్రమలు క్రమక్రమంగా ఉత్పత్తిని ప్రారంభిస్తున్నా.. కూలీలు, ముడి సరుకు కొరత, పెరిగిన నిర్వహణ వ్యయం, నగదు లభ్యత లేకపోవడం అడ్డంకిగా మారాయని 60% పారిశ్రామికవేత్తలు అన్నారు. భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నడుమ చైనా ముడి సరుకు దిగుమతులను ఒక్కసారిగే ఆపేస్తే నష్టమేనన్న అభిప్రాయాలు మెజారిటీ పరిశ్రమ వ్యక్తం చేయడం గమనార్హం. 

వలస కూలీలను రప్పించాలి

కరోనా మహమ్మారి కారణంగా సొంత రాష్ర్టాలకు వెళ్లిన వలస కార్మికులను తిరిగి రప్పించాలని పారిశ్రామికవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో 10 శాతానికిపైగా ఉద్యోగాలు పోయాయని 32% పారిశ్రామికవేత్తలు ఈ సర్వేలో తెలియజేశారు. కార్మికులు తిరిగి రావడానికి రాయితీతో కూడిన రవాణా సదుపాయాన్ని వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక కేంద్రం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటి స్కీం కొంతవరకే ఊరటనిస్తున్నదని 20% పరిశ్రమ పేర్కొన్నది. బ్యాంకుల వడ్డీ తగ్గింపు లాభాలూ అంతంతేనని తేలింది. మరోవైపు జీఎస్టీ భారాన్ని తగ్గించాలని ఈ సర్వేలో పారిశ్రామికవేత్తలు డిమాండ్‌ చేశారు. ఐటీ శ్లాబుల్లో మార్పులు చేసి ప్రజల చేతిలో మరింత నగదు ఉండేలా చూడాలన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పనులు చేపట్టాలని 36% పారిశ్రామికవేత్తలు కోరారు. 


logo