గురువారం 04 జూన్ 2020
Business - May 13, 2020 , 00:44:13

పాతాళానికి పారిశ్రామిక ఉత్పత్తి

పాతాళానికి పారిశ్రామిక ఉత్పత్తి

మార్చిలో రికార్డు స్థాయికి పతనం l మైనస్‌ 16.7%గా నమోదు

న్యూఢిల్లీ, మే 12: దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ మార్చిలో ఏకంగా మైనస్‌ 16.7 శాతానికి దిగజారింది. 2012 ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాకా ఈ స్థాయిలో ఐఐపీ పడిపోవడం ఇదే తొలిసారి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గనులు, తయారీ, విద్యుత్‌ ఉత్పత్తి రంగాలు కుదేలవడంతో యావత్‌ పారిశ్రామిక రంగమే కుప్పకూలింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) మంగళవారం విడుదల చేసిన వివరాల ప్రకారం తయారీ రంగ కార్యకలాపాలు 20.6%, విద్యుదుత్పత్తి 6.8% చొప్పున క్షీణించాయి. గతేడాది మార్చిలో ఇవి వరుసగా 3.1%, 2.2% వృద్ధిని నమోదు చేసుకున్నాయి. గనుల రంగంలో ఉత్పత్తి మాత్రం 0.8%తో స్థిరంగా ఉన్నది. కాగా, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ ఉత్పత్తి సైతం 33.1% క్షీణించింది. అలాగే నాన్‌-డ్యూరబుల్స్‌ ఉత్పత్తి 16.2 శాతం పతనమైంది. నిరుడు మార్చిలో ఐఐపీ వృద్ధిరేటు 2.7%గా ఉన్నది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరం (2019-20) ఐఐపీ మైనస్‌ 0.7%గా నమోదైనట్లు ఎన్‌ఎస్‌వో తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది 3.8% వృద్ధిని కనబరిచింది.

విడుదల కాని ద్రవ్యోల్బణ గణాంకాలు

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ నెలకుగాను వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలను మంగళవారం ఎన్‌ఎస్‌వో విడుదల చేయలేదు. అయినప్పటికీ టెలిఫోన్‌ ద్వారా సమాచారాన్ని సేకరించామని ఎన్‌ఎస్‌వో తెలిపింది. సాధారణంగా ఎంపిక చేసిన 1,114 పట్టణ మార్కెట్లకు, 1,181 గ్రామాలకు క్షేత్రస్థాయి సిబ్బంది వెళ్లి సమాచారాన్ని సేకరిస్తారు. కానీ లాక్‌డౌన్‌తో ఈ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. కాగా, మార్చితో పోల్చితే పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల ధరలు ఏప్రిల్‌ నెలలో పెరుగలేదన్న సమాచారం ఉన్నది.


logo