శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 28, 2020 , 00:09:34

ఇండిగో లాభాల్లో దూకుడు

ఇండిగో లాభాల్లో దూకుడు
  • క్యూ3లో రూ.496 కోట్లు ఆర్జించిన సంస్థ

న్యూఢిల్లీ, జనవరి 27: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో పేరుతో సేవలు అందిస్తున్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ ఆర్థిక ఫలితాల్లో దూకుడు ప్రదర్శించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ రూ.496 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.185.20 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లకు పైగా ఎగబాకింది. ఆదాయం అధికంగా సమకూరడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్యకాలానికిగాను సంస్థ రూ.10,330.2 కోట్ల ఆదాయాన్ని గడించింది. ఏడాది క్రితం సమకూరిన రూ.8,229.30 కోట్లతో పోలిస్తే 25.5 శాతం అధికమైంది. వీటిలో ప్యాసింజర్‌ టిక్కెట్లను విక్రయించడం ద్వారా రూ.8,770.30 కోట్ల ఆదాయం సమకూరగా, ఇతర మార్గాల ద్వారా మరో రూ.1,037.30 కోట్లు లభించాయి. గత త్రైమాసికంలో సరాసరిగా విమాన టిక్కెట్టు ధర 2.1 శాతం పెరిగి కిలోమీటర్‌కు రూ.3.88కి చేరుకున్నది. అంతక్రితం ఏడాది ఇది రూ.3.83గా ఉన్నది. చమురుపై సంస్థ పెట్టే ఖర్చు రెండు శాతం తగ్గి రూ.334.19 కోట్లకు పరిమితమైంది. ‘వ్యాపారాన్ని భారీగా విస్తరించడంపై చాలా సంతోషంగా ఉన్నాను.


నూతన నగరాలకు విమాన సర్వీసులు అందించడం వల్లనే ఫలితాల్లో భారీ వృద్ధి నమోదైంది’ అని ఇండిగో సీఈవో రోనోజాయ్‌ దత్‌ తెలిపారు. ప్రస్తుతం సంస్థ చేతిలో ఉన్న 257 విమానాలతో సేవలు అందిస్తున్నది. గత త్రైమాసికంలో సంస్థ ఏడు అంతర్జాతీయ రూట్లకు, 17 దేశీయ రూట్లకు విమాన సర్వీసులను ఆరంభించింది. దీంతో రోజువారి సర్వీసుల సంఖ్య 1,634కి చేరుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం వల్లనే దేశీయ విమానయాన రంగంలో తొలిస్థానంలో కొనసాగుతున్నామని, ప్రతియేటా కెపాసిటీ కూడా పెరుగుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత త్రైమాసికంలో ప్రయాణికుల్లో వృద్ధి 20 శాతంగా ఉంటుందని ఆయన అంచనావేస్తున్నారు. 2019-20లో ఇది 23 శాతంగా ఉన్నది. డిసెంబర్‌ 31నాటికి కంపెనీ చేతిలో రూ.20,068 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. వీటిలో రూ.9,412 కోట్ల నగదు కాగా, మిగతా రూ.10,656 కోట్లు నగదు రూపంలో ఉన్న పెట్టుబడులని పేర్కొంది. 


logo