మంగళవారం 26 మే 2020
Business - Apr 30, 2020 , 13:40:41

36 శాతం పడిపోయిన బంగారం డిమాండ్‌

36 శాతం పడిపోయిన బంగారం డిమాండ్‌

ముంబై: ఆర్థిక అనిశ్చితి, కరోనా వైరస్‌తో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌, ధరలు స్థిరంగా ఉండకపోవడంతో జనవరి-మార్చి త్రైమాసికలో దేశంలో బంగారానికి 36 శాతం డిమాండ్‌ పడిపోయింది. దీంతో 101.9 టన్నులకు తగ్గిందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో నగలు, బంగారంపై పెట్టుబడి డిమాండ్‌ కూడా పడిపోయిందని, ఇది చాలా సవాళ్లతో కూడుకున్న ఏడాదిగా నిలువనుందని పేర్కొంది. మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్‌ 20 శాతం పడిపోయి రూ.37,580 కోట్లకు చేరిందని, గతేడాది ఇదే సమయంలో రూ.47 వేలుగా ఉందని తెలిపింది.

పది గ్రాముల బంగారం ధర 25 శాతం పెరిగి, ఎక్సైజ్‌ సుంకం, ఎలాంటి పన్నులు లేకుండా రూ.36,875కు చేరిందని, 2019 ఆర్థికసంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇది రూ.29,555గా ఉందని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ పీఆర్‌ సోమసుందరం వెల్లడించారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో బంగారు నగలకు డిమాండ్‌ 41 శాతం పడిపోయి 73.9 టన్నులకు తగ్గిందని చెప్పారు. ఇది 2019, జనవరి-మార్చి త్రైమాసికంలో 125.4 టన్నులుగా ఉన్నదని ఆయన తెలిపారు.


logo