గురువారం 02 జూలై 2020
Business - Jun 02, 2020 , 00:41:51

ఈ ఏడాది -4% జీడీపీ

ఈ ఏడాది -4% జీడీపీ

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో -3.2 శాతం
  • క్యూ1లో 22.2 శాతం క్షీణించే అవకాశం
  • లాక్‌డౌన్‌తో దేశానికి 306 బిలియన్‌ డాలర్ల నష్టం
  • ప్రతికూల వృద్ధిపై బార్క్‌లేస్‌ తాజా అంచనా

న్యూఢిల్లీ/ముంబై, జూన్‌ 1: కరోనా సంక్షోభం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ ఆర్థిక వృద్ధిరేటు వ్యతిరేకంగా ఉండటం ఖాయమన్న అభిప్రాయం రోజురోజుకూ బలపడుతున్నది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) సైతం ఇప్పటికే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ జీడీపీ వృద్ధిరేటు ఎంతమేరకు వ్యతిరేకంగా ఉంటుందో స్పష్టం చేయలేదు. అయితే భారత జీడీపీ వృద్ధిరేటు ప్రస్తుత క్యాలండర్‌ సంవత్సరంలో -4 శాతానికి, ఈ ఆర్థిక సంవత్సరంలో -3.2 శాతానికి చేరవచ్చని గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ ‘బార్క్‌లేస్‌' అభిప్రాయపడింది. జీడీపీ వృద్ధిపై గతంలో వేసిన అంచనాలను ‘బార్క్‌లేస్‌' సవరిస్తూ.. ఈ ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో వృద్ధిరేటు 22.2 శాతం వరకు క్షీణించవచ్చని, గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ క్షీణత 12.4 శాతంగా ఉన్నదని తెలిపింది. ‘భారత్‌లోని పలు రాష్ర్టాల్లో రవాణాపై ఇప్పటికీ పాక్షికంగా ఆంక్షలున్నాయి. నాలుగో విడుత లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా ఆర్థికంగా కీలకమైన రాష్ర్టాల్లో మరో 10 వారాల వరకు (ఆగస్టు మధ్య వరకు) ఈ ఆంక్షలు కొనసాగే అవకాశం కనిపిస్తున్నది. దీనివల్ల అదనంగా జరిగే ఆర్థిక నష్టం 71.5 బిలియన్‌ డాలర్ల వరకు ఉండవచ్చు. ఫలితంగా లాక్‌డౌన్‌ వల్ల భారత్‌కు ఆర్థికంగా జరిగే మొత్తం నష్టం 306 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఇది దేశ జీడీపీలో 11.5 శాతానికి సమానం’ అని తాజాగా విడుదల చేసిన నోట్‌లో ‘బార్క్‌లేస్‌' పేర్కొన్నది.


logo