బుధవారం 24 ఫిబ్రవరి 2021
Business - Feb 16, 2021 , 03:07:31

జోరుగా ఎగుమతులు

జోరుగా ఎగుమతులు

  • వరుసగా రెండో నెల పరుగు 
  • ఫార్మా, ఇంజినీరింగ్‌ రంగాల దన్నుతో  జనవరిలో 6.16 శాతం వృద్ధి
  • 27.45 బిలియన్‌ డాలర్లుగా నమోదు l 14.54 బిలియన్‌ డాలర్లకు వాణిజ్య లోటు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భారతీయ ఎగుమతులు గాడిన పడుతున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో పడకేసిన ఎగుమతులు.. మళ్లీ పరుగులు పెడుతున్నాయి. వరుసగా రెండో నెల వృద్ధిని కనబరుస్తూ ఈ ఏడాది జనవరిలో దేశీయ ఎగుమతులు 27.45 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. నిరుడు డిసెంబర్‌లోనూ 0.14 శాతం వృద్ధి నమోదైన విషయం తెలిసిందే. ఇక గతేడాది జనవరితో పోల్చితే ఈ జనవరిలో ఎగుమతులు 6.16 శాతం పుంజుకున్నాయి. ఫార్మా, ఇంజినీరింగ్‌ రంగాల్లో 16.4 శాతం, 19 శాతం చొప్పున వృద్ధి కనిపించింది. 

ఫార్మా ఎగుమతులు 2 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, ఇంజినీరింగ్‌ ఎగుమతులు 7.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని సోమవారం విడుదలైన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఆయిల్‌ మీల్స్‌, ఇనుప ఖనిజం, పొగాకు, బియ్యం, పండ్లు, కూరగాయలు, తివాచీలు, హస్తకళ ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, తేయాకు, బాదాం, ప్లాస్టిక్‌, రసాయనాల ఎగుమతులూ ఈసారి పెరిగాయి. అయితే పెట్రోలియం ఉత్పత్తులు (32 శాతం), రెడిమేడ్‌ దుస్తులు (10.73 శాతం), తోలు (18.6 శాతం) ఎగుమతులు దిగజారాయి.

42 బిలియన్‌ డాలర్ల దిగుమతులు

జనవరిలో దేశంలోకి వచ్చిన దిగుమతులు 42 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది జనవరితో పోల్చితే ఇది 2 శాతం ఎక్కువ. అయినప్పటికీ ఎగుమతులు భారీగా పెరుగడంతో వాణిజ్య లోటు 14.54 బిలియన్‌ డాలర్లకు దిగివచ్చింది. నిరుడు జనవరిలో 15.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. డిసెంబర్‌లో 15.44 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది.

పెరిగిన బంగారం దిగుమతులు

బంగారం దిగుమతులు మళ్లీ పెరిగాయి. జనవరిలో దాదాపు 155 శాతం ఎగబాకి 4 బిలియన్‌ డాలర్లకు చేరాయి. మరోవైపు చమురు దిగుమతులు 9.40 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. నిరుడు 13.01 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే పప్పుధాన్యాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, ముడి పత్తి, వెజిటబుల్‌ ఆయిల్‌, రసాయనాలు, యంత్ర సామాగ్రి దిగుమతులు పెరిగాయి. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్‌-జనవరిలో దేశ ఎగుమతులు 13.58 శాతం క్షీణించి 228.25 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. 

VIDEOS

logo