బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Feb 08, 2020 , 23:31:51

ఐసీయూలోకి ఆర్థికం

ఐసీయూలోకి ఆర్థికం
  • మోదీ వైఫల్యాలతో అన్ని రంగాలు కుదేలు: మాజీ మంత్రి చిదంబరం విమర్శ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వ వరుస వైఫల్యాలతో దేశ ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తంగా మారి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)కి చేరుకున్నదని, ఇది ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడంలేదని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, పార్లమెంట్‌ సభ్యుడు ఆర్‌ చిదంబరం విమర్శలు గుప్పించారు. నరేంద్రమోదీ సర్కార్‌ అసమర్థత వల్ల అన్ని రంగాలు ఆర్థికంగా కుదేలయ్యాయని ధ్వజమెత్తారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌పై శనివారం బంజారాహిల్స్‌లోని ముఫకమ్‌జా ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కాలేజీలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాడారు. ఈ బడ్జెట్‌ కేంద్ర ప్రభుత్వం దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ సబ్‌కా విశ్వాస్‌' అన్నది కేవలం నినాదంగానే మిగిలిందని ‘సబ్‌కా బర్‌బాద్‌' అనే మాదిరిగా పరిస్థితి తయారైందని దుయ్యబట్టారు. గత వార్షిక బడ్జెట్‌లో మోదీ సర్కార్‌ వివిధ రంగాలకు కేటాయించిన నిధులను చాలావరకు ఖర్చుచేయలేదని, ప్రస్తుత బడ్జెట్‌లో పలు రంగాలకు నిధుల కేటాయింపులో కోతలు విధించారని మండిపడ్డారు. పన్నుల వాటా రూపంలో రాష్ర్టాలకు ఇవ్వాల్సిన నిధులను దాదాపు లక్ష కోట్ల రూపాయల మేరకు తగ్గించారని, దీంతో ఒక్కో రాష్ర్టానికి కనీసం 5 నుంచి 10 వేల కోట్ల రూపాయల మేరకు గండిపడిందని, మోదీ సర్కార్‌ అసమర్థ విధానాల వల్ల రాష్ర్టాలు నష్టపోవాల్సి వచ్చిందని విశ్లేషించారు. కేంద్ర ప్రభుత్వం పేదల వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని, బడ్జెట్‌లో సబ్సిడీలను తగ్గించిందన్నారు. 


ఆహారభద్రత కోసం గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.1.84 లక్షల కోట్లలో 72 శాతం నిధులే ఖర్చుపెట్టారని, ఈసారి కేటాయింపులను రూ.1.50 లక్షల కోట్లకు తగ్గించి ఆహార రాయితీలకు ఎగనామం పెడుతున్నదని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం చారిత్రక తప్పిదమని, ఆ నిర్ణయం వల్ల నగదు చెలామణి ఆగిపోయి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దెబ్బతినడంతోపాటు ప్రజల కొనుగోలు శక్తి తగ్గి వ్యాపారాలకు విఘాతం కలిగిందని, ఎగుమతి, దిగుమతులు గణనీయంగా తగ్గాయని తెలిపారు. ధరలు విపరీతంగా పెరగడం వల్ల గత ఒక్క ఏడాదిలోనే ద్రవ్యోల్బణం 1.95 శాతం నుంచి 7.4 శాతానికి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఉద్దేశం మంచిదే అయినా దాని అమలులో కేంద్రం గందరగోళాన్ని సృష్టించడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని చిదంబరం పేర్కొంటూ.. చివరకు మన్మోహన్‌ సింగ్‌ వచ్చి పరిస్థితిని చక్కదిద్దాలంటారేమోనని ఛలోక్తి విసిరారు. ఈ సదస్సులో తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సుల్తాన్‌ ఉల్‌ ఉలూ మ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ చైర్మన్‌ లతీఫ్‌ మహమ్మద్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.


5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవడం కలే..

2024/25 వరకు దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవడం కలేనని చిదంబరం పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా 2025 నాటికి ఈ లక్ష్యాలకు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదన్నారు. బడ్జెట్‌లో పన్నులను తగ్గిస్తు తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యుడికి ఒరిగేదేమి లేదని, ఇప్పటికీ ఈ విషయంపై స్పష్టత లేదని ఆయన విమర్శించారు. 


logo