మంగళవారం 02 మార్చి 2021
Business - Jan 13, 2021 , 02:59:55

ప్రపంచ టాప్‌-500లోమన కంపెనీలు 11

ప్రపంచ టాప్‌-500లోమన కంపెనీలు 11

  • గతేడాది విలువ 14 శాతం వృద్ధి 
  • రూ.58.97 లక్షల కోట్లకు చేరిక
  • జీడీపీలో మూడో వంతు వీటిదే 
  • తాజా నివేదికలో హురూన్‌ వెల్లడి

ముంబై, జనవరి 12: ప్రపంచంలోని అత్యంత విలువైన టాప్‌-500 ప్రైవేట్‌ కంపెనీల జాబితాలో భారత్‌కు చెందిన 11 కంపెనీలు చోటు లభించింది. ఈ లిస్టులో భారత్‌ 10వ ర్యాంకు దక్కించుకున్నట్లు ఓ నివేదిక స్పష్టం చేసింది. ఈ జాబితాలోని 11 భారత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ గతేడాది 14 శాతం వృద్ధి చెంది 805 బిలియన్‌ డాలర్ల (రూ.58,97,148 కోట్ల)కు చేరింది. దేశ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో ఇది దాదాపు మూడో వంతుకు సమానం. ఈ లిస్టులోని భారత కంపెనీల్లో పొగాకు వ్యాపార దిగ్గజం ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ మినహా మిగిలిన అన్ని కంపెనీల విలువ పెరిగినట్లు ‘హురూన్‌ గ్లోబల్‌ 500’ రిపోర్ట్‌ వెల్లడించింది. భారత కంపెనీల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అగ్రస్థానంలో నిలిచిందని, గతేడాది ఈ కంపెనీ విలువ 20.5 శాతం పెరిగి డిసెంబర్‌ 1 నాటికి 168.8 బిలియన్‌ డాలర్ల (రూ.12,36,680 కోట్ల)కు చేరడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆర్‌ఐఎల్‌ 54వ స్థానాన్ని దక్కించుకున్నదని తెలిపింది. అమెరికన్‌ టెక్‌ దిగ్గజం యాపిల్‌ 2.1 ట్రిలియన్‌ డాలర్ల (రూ.1,53,76,494 కోట్ల) విలువతో ప్రపంచ టాప్‌-500 కంపెనీల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నదని, ద్వితీయ స్థానంలో మైక్రోసాఫ్ట్‌ (విలువ 1.6 ట్రిలియన్‌ డాలర్లు లేదా రూ.1,17,19,384 కోట్లు), అమెజాన్‌ (విలువ 1.6 ట్రిలియన్‌ డాలర్లు లేదా రూ.1,17,19,384 కోట్లు) నిలిచాయని వెల్లడించింది. దేశాల పరంగా చూస్తే అమెరికా అగ్రస్థానంలో నిలిచిందని, జాబితాలోని మొత్తం 500 కంపెనీల్లో 242 కంపెనీలు అమెరికావేనని తెలిపింది. 51 కంపెనీలతో చైనా ద్వితీయ స్థానంలో, 30 కంపెనీలతో జపాన్‌ తృతీయ స్థానంలో నిలిచాయని, 11 కంపెనీలతో భారత్‌ 10వ ర్యాంకుతో సరిపెట్టుకున్నదని హురూన్‌ వివరించింది. 


VIDEOS

logo