భారత్ @ టాప్-3

- తలసరి ఆదాయం 5 వేల డాలర్లకు పెరుగవచ్చు
- రానున్న రెండు దశాబ్దాల్లో దేశ ఆర్థికాభివృద్ధిపై అంబానీ అంచనా
- ఫేస్బుక్ సీఈవోతో ముఖాముఖి
న్యూఢిల్లీ: రానున్న రెండు దశాబ్దాల్లో భారత్ ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా భారతీయుల తలసరి ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువ స్థాయికి పెరుగుతుందని అంచనా వేశారు. ఫేస్బుక్ వ్యవస్థాపక సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌తో మంగళవారం ఆయన ఆన్లైన్లో ముఖాముఖిగా మాట్లాడుతూ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశంలో దాదాపు సగం మధ్యతరగతి కుటుంబాలే ఉన్నాయని, వీరి ఆదాయం ఏటా 3 నుంచి 4 శాతం వరకు పెరుగుతుందని ముకేశ్ అంబానీ అంచనా వేశారు. ‘వచ్చే రెండు దశాబ్దాల్లో భారత్ ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నా. అంతేకాకుండా యువత ముందుండి నడిపించే ప్రధాన డిజిటల్ సమాజంగా భారత్ ఆవిర్భవిస్తుంది. మన తలసరి ఆదాయం 1,800-2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పెరుగుతుంది. ఫేస్బుక్, జియోతోపాటు ప్రపంచంలోని ఇతర కంపెనీలు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములై రానున్న దశాబ్దాల్లో జరిగే సామాజిక మార్పులో పాలుపంచుకోవడం భారత్‌కు గొప్ప సువర్ణావకాశం’ అని ఆయన పేర్కొన్నారు. కొవిడ్-19 సంక్షోభాన్ని భారత్ ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నదని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సర ద్వితీయార్ధంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు భారత్ సిద్ధమైందని ముకేశ్ అంబానీ తెలిపారు.
వాట్సాప్ పేమెంట్ సేవల్ని విస్తరిస్తాం: జుకర్‌బర్గ్
ప్రపంచంలోనే ఎంతో గొప్ప వ్యాపార సంస్కృతితో అలరారుతున్న భారత్ చాలా ప్రత్యేకమైన, ముఖ్యమైన దేశమని మార్క్ జుకర్‌బర్గ్ కొనియాడారు. భారత్‌లో ఇటీవల ప్రారంభించిన తమ వాట్సాప్ పేమెంట్ సేవలను మరింత విస్తరిస్తామని చెప్పారు. ఫేస్బుక్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాట్సాప్ భారత్‌లో పేమెంట్ సర్వీసులను ప్రారంభించేందుకు గత నెలలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నుంచి అనుమతి పొందిన విషయం తెలిసిందే. భారత్‌లో యూపీఐ ఆధారిత పేమెంట్ సేవలను ప్రారంభించేందుకు 2018 నుంచే కసరత్తు మొదలుపెట్టిన వాట్సాప్ ఎట్టకేలకు గత నెలలో ఈ సేవలను ప్రారంభించింది. ప్రపంచంలో వాట్సాప్ పేమెంట్ సేవలు తొలుత భారత్‌లోనే ప్రారంభం కావడం విశేషం.
తాజావార్తలు
- నా రేంజ్ మీకు తెలుసా అంటూ షణ్ముఖ్ వీరంగం..!
- రాజశేఖర్ కూతురు తమిళ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- డేటా చోరీ గిఫ్ట్‌ల పేర బురిడీ..!
- షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు
- ఓటీపీ చెప్పండి.. కార్డు గడువు పొడిగిస్తాం..!
- రెండు రోజుల్లో.. రూ. 5లక్షలకు 4.5 కోట్లు లాభం
- రుణాల పేరుతో.. బురిడీ..
- పెండ్లి పేరుతో వల.. రూ. 10.69లక్షలు టోకరా
- బండి ఆపు.. పైసలివ్వు..!