ఎలక్ట్రిక్ వీల్స్

- ఈవీల వైపు వడివడిగా భారత్ అడుగులు
- ఈ ఏడాది మార్కెట్లోకి రానున్న మోడళ్లు ఇవే
విద్యుత్ వాహనాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అమెరికన్ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత్ మార్కెట్లో అడుగు పెట్టింది. త్వరలో ఆ కంపెనీ తన మోడల్ 3 ఈవీని మూడు రకాల బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకురానున్నది. వీటిలో 50 కిలోవాట్స్/అవర్ బ్యాటరీ వేరియంట్ దాదాపు 354 కి.మీ. దూరం.. 54 కిలోవాట్స్/అవర్ బ్యాటరీ వేరియంట్ 423 కి.మీ. దూరం.. 75 కిలోవాట్స్/అవర్ బ్యాటరీ వేరియంట్ 568 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తాయి. ఈ లగ్జరీ కార్ల ప్రారంభ ధరను దాదాపు రూ.55 లక్షలుగా నిర్ణయించవచ్చని తెలుస్తున్నది.
భారత ఆటోమొబైల్ పరిశ్రమ విద్యుత్ వాహనాల తయారీ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్న కంపెనీల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. దీంతో వివిధ దేశీయ కంపెనీలతోపాటు ఆడీ, జాగ్వార్, టెస్లా లాంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థల నుంచి పలు ఎలక్ట్రిక్ వాహనాలు ఈ ఏడాదిలోనే మార్కెట్లోకి రానున్నాయి. వీటిలో కొన్ని వాహనాల కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవేమిటంటే..
టాటా ఆల్ట్రోజ్ ఈవీ
దేశీయ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన టాటా మోటర్స్ ఈ ఏడాది చివర్లోగా ఆల్ట్రోజ్ ఈవీని మార్కెట్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఇప్పటికే దీన్ని జెనీవా మోటర్ షో-2019తోపాటు గతేడాది జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ప్రస్తుతానికి ఆల్ట్రోజ్ ఈవీ ఫీచర్లేమీ వెల్లడి కాకపోయినప్పటికీ ఈ వాహనం సింగిల్ చార్జింగ్‌తో 250 నుంచి 300 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హ్యుందాయ్ కోనా ఈవీ ఫేస్‌లిఫ్ట్
కొద్ది నెలల క్రితమే కోనా ఈవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టిన హ్యుందాయ్.. ఈ ఏడాది చివర్లోగా దీన్ని భారత్‌లోనూ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నది. కొత్త డిజైన్‌తోపాటు 10.25 అంగుళాల స్టాండర్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, ముందూ, వెనుక హీటెడ్ సీట్ల లాంటి ఎన్నో ఆధునిక ఫీచర్లను ఈ మోడల్ ఆఫర్ చేస్తున్నది. దీని లోయర్ వేరియంట్ 39.2 కిలోవాట్స్/అవర్ బ్యాటరీని, టాప్ వేరియంట్ 64 కిలోవాట్/అవర్ బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్ చార్జింగ్‌తో లోయర్ వేరియంట్ 304 కి.మీ., టాప్ వేరియంట్ 483 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తాయి.
మహీంద్రా ఈఎక్స్యూవీ 300
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ‘ఎక్స్‌యూవీ 300’ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనమే ‘ఈఎక్స్యూవీ 300’. దీని కాన్సెప్ట్ వెర్షన్‌ను కూడా గతేడాది ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈఎక్స్యూవీ ఫీచర్లు ఇంకా వెల్లడి కాకపోయినప్పటికీ సింగిల్ చార్జింగ్‌తో ఈ వాహనం దాదాపు 370 కి.మీ. దూరం ప్రయాణిస్తుందని మహీంద్రా గతంలోనే స్పష్టం చేసింది.
మహీంద్రా ఈకేయూవీ 100
మహీంద్రా అండ్ మహీంద్రా గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ‘ఈకేయూవీ 100’ను ప్రదర్శించింది. ఫేమ్-2 సబ్సిడీలతో కలిపి రూ.8.25 లక్షల ప్రారంభ ధరతో ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని మహీంద్రా లక్ష్యంగా నిర్దేశించుకున్నది. కానీ అంతకంటే ఇంకొంచెం ఎక్కువ ధరతో ఇది మార్కెట్లోకి వస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 15.9 కిలోవాట్స్/అవర్ బ్యాటరీని కలిగి ఉండే ‘ఈకేయూవీ 100’ సింగిల్ చార్జింగ్‌తో దాదాపు 147 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తుంది.